తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ‘దేవర’తో ఆ కోరిక తీరింది. ఎన్టీఆర్ సరసన జాన్వీని చూసి అభిమానులు ఖుషీ అయ్యారు. కానీ అది సరిపోలేదు. ఎందుకంటే.. ‘దేవర’లో జాన్వీ పాత్ర పరిధి చాలా తక్కువ. పాటలకే పరిమితం అయ్యింది. గ్లామర్ కోణం మాత్రమే ఆవిష్కృతమైంది. జాన్వీ శ్రీదేవిలా గొప్ప పెర్ఫార్మర్ కాదు కానీ, తన నటన డీసెంట్ గానే ఉంటుంది. జాన్వీ హిందీ సినిమాలు చూసినవాళ్లకు అది అర్థం అవుతుంది. కానీ `దేవర`లో ఆ కోణం కనిపించలేదు.
ఇప్పుడు ‘పెద్ది’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఇప్పటి వరకూ ‘పెద్ది’ నుంచి వచ్చిన లుక్స్ చూస్తుంటే ఈసారి తన పాత్ర గ్లామర్ కే పరిమితం కాబోతోందేమో అనిపిస్తోంది. శ్రీకాకుళం అమ్మాయి అచ్చీయమ్మగా ఈ సినిమాలో కనిపించబోతోంది జాన్వీ. తన లుక్స్ బాగున్నాయి. తాజాగా వచ్చిన ‘చికిరి’ పాటలోనూ తనని అలానే చూపించారు. జాన్వీ అంటే కేవలం గ్లామరేనా? ఇంకేం లేవా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎప్పుడూ ఇలాంటి లుక్స్ లోనే కనిపిస్తే.. ఆమె వల్ల సినిమాకు గానూ, సినిమాల వల్ల ఆమె కెరీర్‌కు గాని పెద్దగా ఒరిగేదేం ఉండదు. ‘పెద్ది’ కమర్షియల్ మీటర్ లో సాగే సినిమా. కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్ కూడా అలానే తీర్చిదిద్దడంలో తప్పులేదు. కాకపోతే.. దర్శకుడు బుచ్చిబాబు మరీ ఈ క్యారెక్టర్ ని రొటీన్ గా రాస్తాడనిపించడం లేదు. తన తొలి సినిమా `ఉప్పెన`లో హీరోయిన్ పాత్రని స్ట్రాంగ్ గానే తీర్చిదిద్దాడు. అలాంటి మెరుపులేమైనా ఈ అచ్చీయమ్మలో కనిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగులో మంచి పునాదులు వేసుకోవడానికి జాన్వీ ప్రయత్నిస్తోంది. అలా జరగాలంటే ఆమెలోని కేవలం గ్లామర్ ని మాత్రమే వాడుకొంటే సరిపోదు. కచ్చితంగా పెర్ఫార్మర్‌ని కూడా బయటకు తీసుకుని రావాల్సిందే. ఆ ప్రయత్నం బుచ్చి చేస్తే బాగుంటుంది.