బీజేపీలో విలీనం కోసం కేటీఆర్ తన దగ్గరకు వచ్చారని సీఎం రమేష్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ గతుక్కుమన్నారు. ఎలా స్పందించాలో తెలియక పాత ఆరోపణలు రిపీట్ చేశారు. బీఆర్ఎస్వీ సమావేశానికి హాజరైన ఆయన.. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోతే బాగుండదని అనుకున్నారేమో కానీ డొంక తిరుగుడు ఎదురుదాడి చేసి మమ అనిపించారు. కానీ సీఎం రమేష్ చేసిన అనేక వ్యాఖ్యలపై కనీస స్పందనలేదు.
మళ్లీ అదే కంచ గచ్చిబౌలి భూములు, ఫ్యూచర్ సిటీరోడ్ల కాంట్రాక్ట్ గురించి మాట్లాడారు. అందులో స్కామ్ ఉంటే కేటీఆర్ బయట పెట్టాలి కానీ.. ఇద్దరూ కలిసి వస్తే చర్చిస్తానని సవాల్ చేస్తున్నారు. ఈ విషయాలపై కన్నాఅసలు సీఎం రమేష్ ఇంటికి వెళ్లడం, బీఆర్ఎస్ విలీనం గురించి చర్చించడం, మాల్దీవులు, అమెరికా పర్యటనల గురించి, కమ్మవారి గురించి కేటీఆర్ చేసినట్లుగా సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించాల్సి ఉంది. కానీ అవేమీ మాట్లాడకుండా..అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని.. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసని కవర్ చేసుకున్నారు.
నిజంగా చర్చించారో లేదో మాత్రం ఖండించలేదు. సీఎం రమేష్ మాటల్ని కేటీఆర్ ఖండిచకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా సమస్యలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఖండిస్తే సీఎం రమేష్ సీసీఫుటేజీ బయట పెడతారు. కేటీఆర్ అనవసరంగా తమ వివాదంలోకి సీఎం రమేష్ ను తీసుకు వచ్చి వివాదాన్ని పెద్దది చేసుకున్నారు. విలీనం కోసం బీజేపీని బతిమాలుకున్న వైనంపై ముందు ముందు చాలు విశేషాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.