తెలంగాణలో వరి సాగులోకి దూసుకెళ్లింది. కానీ ఏపీ మాత్రం పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే పెరగలేదు ..తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే స్వల్పంగా తగ్గింది. దీంతో తెలంగాణ ధాన్యాగారంగా మారిందని ఏపీలో ప్రభుత్వాలు వరి పంటను నిర్లక్ష్యం చేస్తున్నాయని సోషల్ మీడియాలో కొంత మంది విమర్శలు చేస్తున్నారు. కానీ వరి సాగు చేయడమే వ్యవసాయం మెరుగుదలకు సంకేతం కాదు. రైతులకు మెరుగైన ఆదాయం రావాలంటే లాభదాయక పంటల వైపు వెళ్లాలి. ఏపీ రైతులు చాలా త్వరగా దీన్ని అడాప్ట్ చేసుకున్నారు.
ఏపీ జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా 30 శాతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి లో వ్యవసాయ రంగం వాటా 30 శాతానికిపైగా ఉంది. తెలంగాణలో ఇది కేవలం 16 శాతం మాత్రమే. అంటే, ఏపీలో వరి సాగు పెరగకపోయినా, వ్యవసాయ అనుబంధ రంగాలు గణనీయమైన విలువను జోడిస్తున్నాయి. వరి వంటి సాంప్రదాయ పంటల కంటే ఆక్వాకల్చర్ , , ఉద్యానవన పంటలు రైతులకు అధిక ఆదాయాన్ని అందిస్తున్నాయి. వరి సాగు విస్తీర్ణం పెరగకపోవడానికి ప్రధాన కారణం పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు , తగ్గుతున్న నికర లాభం. ఒక ఎకరం వరి సాగు చేయడానికి అయ్యే కూలీలు, ఎరువులు, రవాణా ఖర్చులతో పోలిస్తే, పండించిన ధాన్యానికి వచ్చే మద్దతు ధర రైతుకు ఆశించిన స్థాయిలో మిగిల్చడం లేదు.
వరి సాగు చేయడమే వ్యవసాయం కాదు !
ఏపీలోని కోస్తా తీర ప్రాంత రైతులు వరి పొలాలను ఆక్వా చెరువులుగా మార్చడం ద్వారా ఎకరానికి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోనే రొయ్యల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉండటం ఈ మార్పునకు నిదర్శనం. రాయలసీమ , ఇతర మెట్ట ప్రాంతాల్లో రైతులు వాణిజ్య పంటలైన మిరప, వేరుశనగ, మామిడి, అరటి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉంది. వరి కంటే ఈ పంటలకు నీటి వినియోగం తక్కువ, కానీ మార్కెట్ విలువ ఎక్కువ. రైతులు కేవలం ఆహార భద్రత కోసం కాకుండా, ఆదాయ భద్రత కోసం ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. ఇది ఆర్థికంగా ఆరోగ్యకరమైన పరిణామమే.
ఏపీ ప్రాధాన్యతలు వేరు.. తెలంగాణ ప్రాధాన్యతలు వేరు !
తెలంగాణ వరి సాగులో భారతదేశ ధాన్యాగారంగా ఎదగడం అభినందనీయం. అయితే, ఏపీ తన వ్యవసాయ రంగాన్ని పారిశ్రామికీకరణ వైపు మళ్లిస్తోంది. పండిన పంటను నేరుగా అమ్మేయకుండా, ప్రాసెసింగ్ ద్వారా విలువ జోడించడం పై దృష్టి పెడుతోంది. వ్యవసాయ రంగం 50 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న తరుణంలో, కేవలం వరి మీదనే ఆధారపడకుండా విభిన్న రకాల లాభదాయక పంటల వైపు వెళ్లడం వల్ల భవిష్యత్తులో మార్కెట్ ఒడిదుడుకుల నుండి రైతులకు రక్షణ లభిస్తుంది.
వరి సాగు పెరగకపోవడం అనేది ఏపీ వ్యవసాయ రంగ వైఫల్యం కాదు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని కాపాడుకుంటూనే, అధిక విలువ కలిగిన వాణిజ్య పంటల ద్వారా రైతుల తలసరి ఆదాయాన్ని పెంచడమే ఏపీ ప్రస్తుత వ్యూహం.
