తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారు. సల్మాన్ ఖాన్ ను కలిశారు. ఆ ఫోటో బయటకు వచ్చే వరకూ రేవంత్ రెడ్డి ముంబై వెళ్లారని ఎవరికీ తెలియదు. ఏదైనా అధికారిక ప్రోగ్రాం కోసం వెళ్లినప్పుడు సీఎంను ఎవరైనా కలిస్తే అది పెద్ద విషయం కాదు. కానీ రేవంత్ రెడ్డి ముంబైకు ఏదైనా అధికారిక పనిమీద వెళ్లారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ సల్మాన్ ఖాన్ ను మాత్రం ఆయన నివాసంలో కలిశారు. ఫోటో బయటకు వచ్చింది.
ఎందుకు కలిశారు అన్నదానిపై స్పష్టమైన వివరాలు లేవు. కానీ చాలా మంది జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో మైనార్టీను ప్రభావితం చేయడానికి కలిశారని చెప్పుకుంటున్నారు. ముస్లిం వర్గాల్లో సల్మాన్ ఖాన్ కు క్రేజ్ ఉంటుంది. యూత్ లో ఇంకా ఉంటుంది. అందులో సందేహం లేదు.కానీ సల్మాన్ ఖాన్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించలేదు. కేవలం ఫోటో దిగారు. ఆ ఫోటో చాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారేమో తెలియదు.
ఈ ఫోటోకు కాంగ్రెస్ నేతల కన్నా బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. విషయం తెలియకుండా ఈ ఫోటోను పోస్టు చేయడానికి కాంగ్రెస్ క్యాడర్ సంశయిస్తోంది. కానీ.. బీఆర్ఎస్ వాళ్లు మాత్రం.. ఓ వైపు తెలంగాణ వరదలతో అల్లాడిపోతూంటే రేవంత్ ముంబై వెళ్లారని.. సల్మాన్ ను కలిశారని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు కావాల్సిందే బీఆర్ఎస్ చేస్తున్నట్లయింది. నిజంగా మైనార్టీలను ఆకట్టుకోవడానికే రేవంత్ ముంబై వెళ్లి సల్మాన్ ను కలిసి ఉంటే.. ఆ ప్రయత్నానికి బీఆర్ఎస్ గట్టి సాయం చేస్తుందని అనుకోవాలి.


