కన్నడ స్టార్ రిషబ్ శెట్టికీ, ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ కూ మధ్య పంచాయితీ నడుస్తోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు బలం చేకూర్చారు రిషబ్ శెట్టి. ఆయన ట్విట్టర్లో హోంబలే ఫిల్మ్స్ ని అన్ ఫాలో చేశారు. దాంతో ఈ వార్తలు నిజమే అనే రూఢీకి వచ్చాయి కన్నడ సినీ వర్గాలు.
‘కాంతార 2’ పారితోషికానికి సంబంధించిన లావాదేవీల విషయంలో రిషబ్ అసంతృప్తితో ఉన్నారని, హోంబలే నిర్మాతలతో ఆయన వాగ్వీవాదానికి దిగారన్నది వార్తల సారాంశం. ఇప్పుడు రిషబ్ తన అసంతృప్తిని ఈ రకంగా వెల్లగక్కినట్టైంది. అయితే పనిలో పనిగా కాంతార 2 కథానాయిక రుక్మిణీ వసంతన్ ని కూడా ఆయన అన్ ఫాలో చేశారు. దాంతో కొత్త చర్చ మొదలైంది. రుక్మిణీ వసంతన్ కీ, రిషబ్ కీ మధ్య ఏం గొడవ జరిగిందో? అంటూ కన్నడ వాసులు చెవులు కొరుక్కొంటున్నారు. అంతే కాదు.. రాజ్ బి.శెట్టిని కూడా ఆయన అన్ ఫాలో చేశారు. రిషబ్, రాజ్ బి శెట్టి ఇద్దరూ సోదరులే. కానీ ఇప్పుడు ట్విట్టర్ లో ఆయన్ని దూరం పెట్టారు. వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో మరి..?
‘కాంతార 1’ మొదలెట్టేటప్పుడు ఆ సినిమాపై ఎవరికీ అంచనాలు లేవు. కానీ సూపర్ డూపర్ హిట్టయ్యింది. కాంతార 2కి హోంబలే ఫిల్మ్స్ భారీగా ఖర్చు పెట్టింది. రిషబ్ ఈ సినిమా కోసం పారితోషికం కాకుండా లాభాల్లో వాటా అడిగారు. సినిమా అంతా పూర్తయ్యాక లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తాయి. మధ్యవర్తులు పంచాయితీ చేసి కొంత వరకూ ఈ గొడవను సర్దుమణిగేలా చేసినట్టు టాక్. కానీ తనకొచ్చిన పారితోషికం విషయంలో రిషబ్ శెట్టి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దాంతో రిషబ్ ఈ నిర్ణయం తీసుకొన్నారు.
