రోజా మంత్రి కాదు..కనీసం ఎమ్మెల్యే కాదు. అయినా ఆమె తిరుమలలోతరచూ కనిపిస్తున్నారు. రంగనాయకుల మండపంలో శాలువా కప్పించుకుని వస్తున్నారు. ఆమె ఒక్కరే కాదు.. ఆమెతో పాటు కనీసం ఇరవై ముఫ్పై మంది వెళ్తున్నారు. వారెవరూ ఆమె చుట్టుపక్కల ఉండరు. కానీ వెళ్లిన వాళ్లను చూస్తే ఆమె రోజాతో పాటు వెళ్లారని.. వాళ్లు కూడా శాలువాలు కప్పించుకుని వచ్చారని సులువుగా అర్థమైపోతుంది.
ఎప్పుడో ఒకసారి అంటే అనుకోవచ్చు.. ఆమె కనీసం రెండు, మూడు వారాలకు ఓ సారి తిరుమలకు వెళ్తారు. బుధవారం కూడా తిరుమలకు వెళ్లారు. సినీ ఇండస్ట్రీకి చెందిన తన స్నేహితులు రవళి, జ్యోతితో పాటు పలువుర్ని తీసుకెళ్లారు. ఆమె గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వీఐపీ దర్శన టిక్కెట్ల వ్యాపారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్టులో ఇవన్నీ బయట పడ్డాయి. అప్పట్లో ఆమె మంత్రిగా ఉన్నా సరే వారానికో రోజు తిరుమలలో ప్రత్యక్షమయ్యేవారు.
ఇప్పుడు ఎలాంటి పవర్ లేకపోయినా.. వీఐపీ కోటా లేకపోయినా ఎలా ఆమెతో పాటు ఆమె బలగాన్ని వీఐపీ దర్శనం చేయించి.. రంగనాయకుల మండపంలో ఎందుకు సన్మానం చేస్తున్నారన్నది ఎవరకీ అర్థం కాని ప్రశ్న. పోనీ ఎవరైనా కోటా కింద లెటర్ ఇచ్చినా..అది ఆమె ఒక్కరికే చెల్లుతుంది. మిగిలిన వారికి ఎలా అన్నది తేలాల్సి ఉంది. అసలు ఆమ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల గురించి.. టిక్కెట్ల విక్రయాల గురించి విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ఏం అడ్డం పడింది ?. ఆడుదాం ఆంధ్రా పేరుతో చేసిన విచారణ రిపోర్టును ఇంకా ఎందుకు పట్టించుకోవడం లేదు ?