రుషికొండ ప్యాలెస్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. తన పార్టీ నేతలందరితో కలిసి ప్యాలెస్ ను పరిశీలించారు. నిర్వహణ లేకపోవడంతో పలు చోట్ల పెచ్చులూడిపోయి కనిపించింది. నెలకు కరెంట్ బిల్లు పదిహేను లక్షలు వస్తోందని అధికారులు చెప్పారు. ఇవన్నీ బయటకు వచ్చాక.. అసలు ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను ఎందుకు నిరుపయోగంగా ఉంచుతోందన్నది అందరికీ వస్తున్న డౌట్. అది హోటల్ కు లేదా..మరో టూరిజం ప్రాజెక్టు కోసం లీజుకు ఇవ్వడానికి చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే.. వాటి గురించి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
గతంలో చంద్రబాబు కూడా ఈ ప్యాలెస్ ను పరిశీలించారు. అప్పట్లో ప్రజా ప్రతినిధులందరూ చూడాలని .. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించి.. దాన్ని ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. కానీ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు విషయం తెరపైకి వచ్చింది. పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని పార్టీ నేతలు చెప్పారు. ఈ బిల్డింగ్ పూర్తి స్థాయిలో సీఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి కట్టిన కట్టడం. కోర్టు ఉత్తర్వులు ఉన్నా.. వాటికేదో వక్రభాష్యం చెప్పి.. నిర్మాణాలు కొనసాగించారు. రోజా చేతుల మీదుగా గృహప్రవేశం కూడా చేయించారు.
కానీ జగన్ ఓడిపోవడంతో దాంట్లో ఉండాలన్న కోరిక నెరవేరలేదు. ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తి.కానీ ఎందుకు ఉపయోగపడుతుందో తెలియని ఆస్తి. అంతకు ముందు ఉన్న టూరిజం రిసార్టుల వల్ల ఏటా ఏడు కోట్లు వచ్చేవి. ఇప్పుడు దాన్ని కూలగొట్టి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం రావాలో అంత వచ్చేలా ప్లాన్ చేయాలని టూరిజం మంత్రికి పవన్ సూచిస్తున్నారు. మరో రెండు, మూడు నెలల్లో.. ఆ భవనాన్ని ఉపయోగంలోకి తీసుకు వచ్చి.. ఎంతో కొంత ఆదాయం జనరేట్ చేస్తే తప్ప.. ప్రజాధనం వృధా కాకుండా కాపాడలేరన్న అభిప్రాయం వినిపిస్తోంది.