“నక్షత్రాలు కిందకొస్తాయా”… ఇప్పుడు ఆంధ్రా యువతలో వినిపిస్తున్న భారీ ప్రశ్న ఇది! అవును… తమిళనాడు జల్లికట్టు ఉద్యమంలో హోదాలతో సంబందం లేకుండా, స్టార్ స్టేటస్ లను పక్కనపెట్టిన తమిళ సినీ నటులు దాదాపుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు! తమిళ యువత పోరాటంలో భాగస్వాములయ్యారు, వారితో కలిపి నడిచారు, అరిచారు, పోరాడారు.. ఏది ఏమైనా సాధించుకున్నారు! ఇదే క్రమంలో ఏపీకి చట్టబద్దంగా రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో యువత జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ప్రత్యేక హోదాపై పోరాడాలని నిర్ణయించుకుంది. మరి ఈ కార్యక్రమానికి, పోరాటానికి మన టాలీవుడ్ స్టార్ హీరోలనుంచి ఎలాంటి మద్దతు లభించబోతుంది.. ఎవరెవరు ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నారు.. ఈ విషయాలపై మన స్టార్స్ అంతా సీరియస్ గా స్పందిస్తారా.. అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తారా?
ఏపీకి ప్రత్యేకహోదా అంటూ ఉద్యమిస్తున్న యువతకు సినీనటుడు పవన్ కళ్యాణ్ నుంచి పూర్తి మద్దతు లభించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సంపూర్నేష్ బాబు, మంచు మనోజ్, రాజ్ తరుణ్ ఇలా కొంతమంది హీరోల నుంచి ట్విట్టర్ ద్వారా మద్దతు లభించింది. అంతవరకూ ఏపీ యువత హ్యాపీ! వీరి సంగతి అలా ఉంచితే… స్టార్స్, స్టార్ హీరోస్ ఎవరెవరు ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్నారు? అంటే… సమాధానం కనిపించడం లేదు. ప్రత్యక్షంగా విశాఖకు వచ్చి పోరాడకపోయినా కనీసం ట్విట్టర్ ద్వారా అయిన కనీస మద్దతు తెలిపే ఆలోచన మన నక్షత్రాలు ఎందుకు చెయ్యలేకపోతున్నాయి అని యువత ఆవేదన చెందుతున్నారు. మరో కొన్ని గంటల్లో ఒక గొప్ప విషయంమీద, రాష్ట్ర భవిష్యత్తు కు సంబందించిన విషయంపై యువత పోరాడబోతుండగా.. ఆ యువత అభిమాన నటులు ఎందుకు స్పందించడంలేదు అనేది వారి బాద. ఇదే యువత సపోర్ట్ తమ సినిమాలకు కావాలి, ఆడియో ఫంక్షన్స్ లో హడావిడికీ కావాలి… మరి అలాంటి యువత అందరికోసం పోరాడుతుంటే… ఈ అందరిలో కొందరైన స్టార్లు ఎందుకు నోరు మెదపడంలేదనే బాద వారు వ్యక్తపరుస్తున్నారు!
ఏపీకి ప్రత్యేక హోదా మా పరిధిలోకి రాని విషయం అని టాలీవుడ్ స్టార్ హీరోలు భావిస్తున్నారా… చంద్రబాబుకు, వెంకయ్యలకు వ్యతిరేకంగా పోరాడటం ఎందుకనుకున్నారా? స్వచ్ఛభారత్ అని ప్రకటించగానే చీపుర్లు పట్టుకుని రోడ్లపైకి వచ్చేసిన మన స్టార్స్ అంతా వారి సొంత రాష్ట్రం కోసం యువత ఉద్యమిస్తుంటే బయటకు రారెందుకు? రేపు అన్న రోజున స్పెషల్ స్టేటస్ వస్తే బాగా లాభపడే వారిలో సినీ జనాలు కూడా ప్రథములే కదా! ఫలితానికి అర్హులైన వారు పోరాటానికి మద్దతెందుకు తెలపరు. పేర్లెందుకు కానీ… ప్రత్యేక హోదా పోరాటానికి గైర్హాజరవుతున్న స్టార్ హీరోలను పేరు పేరునా ప్రశ్నించాలని ఏపీ యువత భావిస్తుంది.. తోడు వస్తారని ఆశిస్తుంది!
(ఒక్కరోజు కళ్లుమూసుకుంటే అయిపోతుంది అని భావించినవారు ఈ పోరాటానికి కలిసి రాకున్నా క్షమించడానికి సిద్దంగానే ఉంది అదే యువత.. ఎందుకంటే అవి నక్షత్రాలు కదా.. కిందకు రావని వారికి తెలుసు!)