రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఎన్డీఏ అధికారంలో ఉన్న బీహార్ నుంచి .. ఏపీలో అరాచకాలు చేసి పోయిన ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకు రాలేకపోతోంది టీడీపీ ప్రభుత్వం. బీహార్‌లో ఉన్నది జేడీయూ ప్రభుత్వం. సీఎం నితీష్ కుమార్ తో టీడీపీ అధినేత కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా ఇక్కడ జగన్ తో కలిసి టీడీపీ నేతలపై అఘాయిత్యాలకు పాల్పడి బీహార్ లో దాక్కున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు ను మాత్రం తీసుకురాలేకపోతున్నారు. కొత్తగా సునీల్ నాయక్ ను కాపాడేందుకు ఏకంగా తమ అనుమతి కావాల్సిందేనని చట్టంలో మార్పులు కూడా చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీలో డెప్యుటేషన్‌పై పని చేస్తూ, రఘురామపై జరిగిన అఘాయిత్యాల్లో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ నాయక్, ప్రస్తుతం తన సొంత కేడర్ అయిన బిహార్‌లో రక్షణ పొందుతున్నారు. కేంద్రంలోనూ, అటు బిహార్‌లోనూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలే అధికారంలో ఉన్నప్పటికీ, నితీష్ కుమార్ ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు అతనికి అండగా నిలుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ పోలీసులు పాట్నాకు వెళ్లి సునీల్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ పోలీసుల అరెస్టు ప్రక్రియను అడ్డుకుంటూ బిహార్ కోర్టులో ట్రాన్సిట్ రిమాండ్‌ను తిరస్కరించడం, పైగా 30 రోజుల పాటు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు తీసుకొచ్చారు. ఇదే సమయంలో, బిహార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని అధికారులపై వేరే రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనలను కఠినతరం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇది సునీల్ నాయక్ వంటి అధికారులను కాపాడేందుకేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు నాయుడుకు నితీష్ కుమార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ఒక ఐపీఎస్ అధికారిని ఏపీకి తీసుకురావడంలో జరుగుతున్న ఆలస్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. జగన్ హయాంలో అరాచకాలకు పాల్పడి ఇప్పుడు బిహార్ చట్టాల చాటున దాక్కుంటున్న సునీల్ నాయక్ వ్యవహారాన్ని ప్రభుత్వం తగినంత సీరియస్‌గా తీసుకోవడం లేదా? లేక బిహార్ వ్యవస్థలు అంతగా ప్రభావితం అయ్యాయా అన్నది సగటు పౌరుడికి అర్థం కావడం లేదు. బాధితుడైన రఘురామ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నప్పటికీ, నిందితుడిని చట్టం ముందు నిలబెట్టలేకపోవడం కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠకు సవాల్‌గా మారింది.
