ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలూ చూసుకోవాలి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కామన్‌గా ఇలానే పనిచేస్తారు! ఇంతకంటే, భిన్నంగా చేయడానికి ఏమీ ఉండదు కదా! కానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి దృష్టిలో ముఖ్యమంత్రి అంటే కేవలం ‘చంద్రబాబు నాయుడు మాత్రమే’ అన్నట్టుంది. ఆయన మాత్రమే పనిచేస్తున్నట్టు వెంకయ్యకు అనిపిస్తున్నట్టుంది! సమయం, సందర్భం దొరకబుచ్చుకుని మరీ చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించడం వెంకయ్యకి అలవాటు. ఆయన మీద ఎందుకంత ప్రత్యేక అభిమానం అనేది అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు ఏ రకమైన ఆపద వచ్చినా, ఆదుకునేందుకు కేంద్రంలో వెంకయ్య ఉన్నారు! స్నేహం ఉండటం మంచిదే.. దాన్ని ఎవ్వరూ తప్పబట్టరు! ఎప్పుడూ చంద్రబాబునే ఎందుకు ప్రశంసిస్తుంటారూ అనే విషయమై తాజాగా వెంకయ్య వివరణ ఇచ్చారు.
ఆంధ్రా సీఎం చంద్రబాబును తాను ఎందుకు పొగుడుతూ ఉంటానో అనేది వెంకయ్య స్పష్టం చేశారు! మంచి పనులు చేస్తున్నవారిని మెచ్చుకోవడం సంస్కారం, అలాంటివారిని ప్రశంసించడం మన బాధ్యత అన్నారు. సీఎం చంద్రబాబు ఆంధ్రాకు మేలు చేస్తున్నారనీ, ఆ విషయాన్ని తాను గమనిస్తున్నాననీ, అందుకే చంద్రబాబును పొగుడుతూ ఉంటానని స్పష్టం చేశారు. అంతేతప్ప, వ్యక్తిగతంగా వేరే కారణాలేవీ లేవని అన్నారు. చంద్రబాబు పనేంటి అంటే… నిరంతరం పనిచేస్తూ ఉండటమే అనే డెఫినిషన్ కూడా ఇచ్చారు!
ఇంతకీ, ‘మంచి చేయడం’ అంటే ఏమిటో వెంకయ్య ఇంకాస్త క్లియర్‌గా వివరించి ఉంటే బాగుండేది! ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రానికి మంచే చేయాలనుకుంటారు. ఆ లెక్కన అందరు ముఖ్యమంత్రుల్నీ వెంకయ్య నాయుడు పొగడ్తలతో ముంచెత్తాలి కదా! చంద్రబాబు నిరంతరం పనిచేస్తూ ఉండటాన్ని ఆయన గుర్తించారని చెప్పారట. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాలీడే ఎంజాయ్ చేయడం కోసం సీఎం కుర్చీలో కూర్చోరు కదా! అందరూ అనుకుంటున్నట్టు చంద్రబాబు అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం లేదని వివరణ ఇచ్చుకునే క్రమంలో… ఆ అభిప్రాయన్నే మరింత బలపడేలా మాట్లాడేశారు వెంకయ్య!