స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకి ఎన్టీఆర్ సహాయం పేరుతో రూ.6,554 కోట్లు మంజూరు చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు. పేరూరు ప్రాజెక్ట్, భైరవతిప్ప ప్రాజెక్టు,పెన్నా-కుముదవతి మరియు ఎగువ పెన్నా ప్రాజెక్టు పనులకి వినియోగిస్తారు. ఆ నిదులలోనే జిల్లాలో త్రాగునీటి సరఫరా, కరువు నివారణ, ఉద్యానవనాల అభివృద్ధి పనులని కూడా చేపడతారు.
జిల్లాకి ముఖ్యమంత్రి నిధులు కేటాయిస్తూ ప్రకటన చేయడం హర్షణీయమే. కానీ ఒకపక్క నిధుల కొరత కారణంగానే అభివృద్ధి పనులు ముందుకు సాగనప్పుడు, అనంతపురం జిల్లాకి నిధులు విడుదల చేయడం సాధ్యమేనా? ఉదాహరణకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు భూసేకరణ కోసం కేవలం 100 కోట్లు అవసరం ఉంటే, దానిని విడుదల చేయలేకపోవడం వలన ఇంతవరకు ఆపని మొదలవలేదు. దానికి సాంకేతిక కారణాల వలననే ఆలశ్యం అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం సర్దిచెప్పుకోవచ్చు.
రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రా ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయిందని చెపుతూ నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం డిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కపెడుతోంది. కనుక అనంతపురం జిల్లాకి ముఖ్యమంత్రి నిన్న ప్రకటించిన నిధులు మంజూరు చేయగాలరా లేదా? ఒకవేళ చేయగలమని భావిస్తే దానికి నిర్దిష్ట కాలపరిమితి కూడా ప్రకటిస్తే ప్రజలకి నమ్మకం కలిగి ఉండేది. లేకుంటే ఇది 601వ హామీగా మిగిలిపోతుంది.
అనంతపురం జిల్లావాసులు చిరకాలంగా తెదేపాని, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని చాలా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో హిందూపురం శాసనసభ నియోజక వర్గానికి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సినిమా షూటింగులతో క్షణం తీరికలేనప్పటికీ తన జిల్లా, తన నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి పనులపై చాలా శ్రద్ద వహిస్తున్నారు. కనుక ఆయనే ఆ నిధులని సాధించుకొని జిల్లాలో అభివృద్ధి పనులని వేగవంతం చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆయన కూడా ప్రజలకిచ్చిన అన్ని హామీలని నిలబెట్టుకోగలుగుతారు.