దేశ యువతను ధూమపానం, సిగరెట్లు, గుట్కాలు వంటి వాటికి దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం వాటిపై పన్నులు పెంచుతోంది. ఫిబ్రవరి ఒకటి ఒక్క సిగరెట్ ధర దాదాపుగా రూ.30కి చేరుకుంటుంది. పాన్ మసాలాల రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా పన్నులు పెంచుతున్నారంటే .. షాక్ కొట్టేలా ధరలు పెంచి వినియోగించడం మానేసేలా చేస్తామని కేంద్రం అంటోంది.కానీ చరిత్రలో ఎన్నో సార్లు పన్నులు పెంచారు కానీ.. సిగరెట్లు తాగేవారు, పాల్ మసాలాలు, గుట్కాలు తినేవారు మాత్రం తగ్గడం లేదు.
సిగరెట్ , గుట్కాలకు బానిస అవుతున్న దిగువ మధ్యతరగతి యువత
భారతదేశంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల వినియోగం యువతలో ముఖ్యంగా తక్కువ సామాజిక, ఆర్థిక స్థాయి నుంచి వచ్చిన యువతలో పెరుగుతోంది. 2024లో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పెద్దలలో సిగరెట్లు తాగేవారి సంఖ్య 9.3 శాతానికి చేరింది, ఇది 2020లో 8.1 శాతంగా ఉంది. చదువుకున్న యువతలో ఈ అలవాటు తగ్గుతున్న సూచనలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతులలో పొగాకు వినియోగం తక్కువగా ఉండగా, తక్కువ విద్యావంతులు, పేదరిక స్థాయిలో ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారింది.
పన్నులు పెంచడం తప్ప.. అవగాహనపై దృష్టి పెట్టని ప్రభుత్వం
ప్రభుత్వం సిగరెట్లు, గుట్కాల వాడకాన్ని నిరోధించేందుకు పన్నులు పెంచుతోంది, కానీ ఈ విధానం ఫలితాలు ఇవ్వడం లేదు. షాక్ కొట్టేలా ధరలు పెంచడం వల్ల వినియోగదారులు మానేస్తారని భావిస్తున్నప్పటికీ, వాస్తవంలో ఇది నకిలీ ఉత్పత్తులు, స్మగ్లింగ్‌ను పెంచుతోంది. ఇటీవలి బడ్జెట్లో సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి మూడు లీగల్ సిగరెట్లకు ఒక అక్రమ సిగరెట్ విక్రయమవుతోందని అంచనాలు ఉన్నాయి, ఇది ప్రభుత్వ ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తోంది. పన్నుల పెంపు వల్ల వినియోగం తగ్గకపోగా, అక్రమ వ్యాపారం పెరిగి ప్రజలు మరిన్ని రిస్కులకు గురవుతున్నారు.
గుట్కాను చాలా రాష్ట్రాలు నిషేధించినా విచ్చలవిడి అమ్మకాలు
గుట్కా మీద చాలా రాష్ట్రాలు నిషేధం విధించినప్పటికీ, ఇది అక్రమ వ్యాపారానికి మాత్రమే లాభదాయకంగా మారింది. పశ్చిమ బెంగాల్, కేరళ, ఏపీ, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో గుట్కా నిషేధం పెద్దగా ప్రభావం చూపలేదు, విక్రేతలు , వినియోగదారులు ఇప్పటికీ అక్రమ మార్గాల ద్వారా దీనిని పొందుతున్నారు. నిషేధం తర్వాత కూడా గుట్కా విక్రయాలు కొనసాగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం దురలవాట్ల నియంత్రణలో ఆదాయాన్ని మాత్రమే చూసుకుంటూ, సమగ్ర చర్యలు తీసుకోవడం లేదు. అవగాహనా కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం వంటివి పెంచాలి. ప్రభుత్వం ఆదాయం కంటే ప్రజారోగ్యాన్ని ప్రాధాన్యతగా చూడాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదన్న అసంతృప్తి ఎక్కువగానే కనిపిస్తోంది.
