తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతూ రేవంత్ రెడ్డి సర్కార్ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతుంటే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కేసీఆర్ అడుగులు సభలోకి పడుతుంటే, జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చేది లేదని చెబుతున్నారు. తనకు ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. అలా ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన అసెంబ్లీకి రారని అర్థమవుతోంది.
ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడే చాన్స్ వస్తుందని జగన్ వాదన
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పదిశాతం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో కేసీఆర్కు ప్రతిపక్ష నేత హోదా అధికారికంగా దక్కింది. దీంతో ఆయనకు సభలో మాట్లాడటానికి తగినంత సమయం, ప్రోటోకాల్ దక్కుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. నిబంధనల ప్రకారం 10 శాతం సీట్లు లేనిదే ప్రతిపక్ష హోదా రాదు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు, సభలో గొంతు వినిపించే అవకాశం లేనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ప్రయోజనం లేదన్నది జగన్ వాదన. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం సంఖ్యాబలం ప్రకారం అవకాశం ఇస్తామని స్పీకర్ చెబుతున్నా ఆయన వినిపించుకోవడం లేదు.
జగన్ చెబుతున్న కారణంతో నవ్వుల పాలు
కేసీఆర్ తన అనుభవాన్నంతా ఉపయోగించి అసెంబ్లీ వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తుంటే, జగన్ మాత్రం ప్రజల పక్షాన పోరాడటానికి అసెంబ్లీనే వేదిక కావాల్సిన పనిలేదు అనే సంకేతాన్ని ఇస్తున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో ఆయన కేవలం 10 నిమిషాలు మాత్రమే సభలో ఉండి, తన నిరసన తెలిపి బయటకు వచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజుల పాటు సభకు గైర్హాజరైతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అందుకే, కనీసం తన సభ్యత్వం కోల్పోకుండా ఉండటానికే జగన్ గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. కానీ ఆ హాజరు చెల్లదని చెబుతున్నారు.
అసెంబ్లీకి రావాలంటే జగన్కు భయం
జగన్ సభకు రాకపోవడాన్ని టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. న్యాయం జరగని చోట గౌరవం ఉండదు అని వైఎస్సార్సీపీ వాదిస్తోంది. కానీ అసలు విషయం మాత్రం అసెంబ్లీకి రావడానికి ఆయనకు భయం. తనతో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. గతంలో అసెంబ్లీలో తాను చేసిన, చేయించిన పనులు ఆయనకు గుర్తు ఉంటాయి. రివెంజ్ తీర్చుకుంటారన్న భయం ఉంటుంది. అందుకే ఆయన .. ప్రతిపక్ష హోదా కారణం చెప్పి హాజరు కావడం లేదు. ఒక వేళ ప్రతిపక్ష హోదా వచ్చినా ఆయన హాజరయ్యేవారు కాదు. ఏదో ఒకటి చెప్పి బహిష్కరించేవారు.
కేసీఆర్కు అసెంబ్లీకి వెళ్లి అధికారపక్షాన్ని ఎదుర్కోవడం వచ్చు. కానీ జగన్ కు అది రాదు. అందుకే.. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లినా ఆయన మాత్రం హాజరు కారు. తన గురువు రాజకీయ బాటలో నడవాలని మాత్రం అనుకోరు.
