ప్రత్యేక హోదా సాధనపై ఏపీలో ఉద్యమాలు మళ్లీ తీవ్రతరం కాబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్రెడ్డి యువభేరీ, జై ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకోపక్క, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పోరాటం చేస్తున్నారు. జనసేన, వైకాపా లక్ష్యం ఒక్కటే! సైద్ధాంతికంగా ఈ రెండు పార్టీల మధ్యా వ్యత్యాసం ఉన్నా… ఒకే అంశంపై పోరాటం చేస్తున్నారు కాబట్టి, కలిసి పోరాడితే బాగుంటుంది కదా అనే అభిప్రాయం మరోసారి తెరమీదికి వచ్చింది. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఈ అంశాన్ని మరోసారి తెరమీదికి తెచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు పవన్, జగన్‌లు వామపక్షాలతో చేతులు కలిపి కార్యాచరణ తయారు చేసుకోవాలని ఆయన కోరారు. అవసరమైతే తాను ఇద్దరితో కలిసి మాట్లాడతాననీ, ఐకమత్యంగా పోరాటం చేద్దామని ఒప్పిస్తా అంటున్నారు. జగన్ పోరాటానికి పవన్ ఉద్యమం కూడా తోడు కావాలని ఆశించారు. నిజానికి, ఇది మంచి ఆలోచనే. ప్రత్యేక హోదా అనేది ప్రజల సమస్య కాబట్టి, రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన సమయం కూడా ఇదే కాబట్టి, కలిసి కదిలితే కదం తొక్కొచ్చు. కానీ, ఇది ఆచరణ సాధ్యమా అనేది అసలు ప్రశ్న?
ఆంధ్రాలో ఇంతవరకూ రెండే రెండు ప్రధాన పార్టీలు. తెలుగుదేశం, వైకాపాలు మాత్రమే తప్ప, ఇన్నాళ్లూ మూడో ప్రత్యామ్నాయానికి ఆస్కారం లేకుండా పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా అది సుప్తచేతనావస్థలో ఉంది! దరిదాపుల్లో కోలుకునేట్టు కనిపించడం లేదు. ఈ తరుణంలో తృతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేన ఎదిగే ఆస్కారం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ పరంగా జనసేనకు ఒక వ్యవస్థీకృతమైన నిర్మాణం ప్రస్తుతానికి లేకపోవచ్చుగానీ, పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను కొట్టిపారేయలేం! ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా విషయంలో జగన్‌తో పవన్ కలిసి పోరాటం చేయడం అనేది ఊహించలేం! పైగా, వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నా అనే సంకేతాలు కూడా పవన్ ఇచ్చారు. చంద్రబాబు, జగన్‌లపై తనకు వ్యక్తిగత కక్షలు లేవనీ, తన పోరాటం వ్యక్తులపై కాదనీ, విధానాలపై మాత్రమే అని పవన్ చేసిన చెప్పడం ద్వారానే తృతీయ ప్రత్యామ్నాయ సంకేతాలు ఇచ్చినట్టైంది. సో… పవన్ సైడ్ నుంచి అయితే జగన్‌తో కలిసి పోరాడే అవకాశం కనిపించడం లేదు!
ఇక, జగన్ వైపు నుంచి చూసుకున్నా… ఈ ప్రతిపాదనను ఆయనా అంగీకరించకపోవచ్చు! ఎందుకంటే, ప్రతిపక్షం పోషించాల్సిన పాత్రను చాలావరకూ పవన్ హైజాక్ చేసేస్తున్నారు. జగన్ స్పందించేలోపే పవన్ ఆ పని చేసేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడా జగన్ కంటే పవన్ కాస్త ముందు ఉంటున్నారు. జగన్ సభలకంటే పవన్ మీటింగులకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటోంది! ఇప్పటికే, ప్రతిపక్షం వెనకబడిపోతోందన్న భావన ఆ పార్టీలోనే వ్యక్తమౌతోంది. ఇలాంటి తరుణంలో పవన్‌తో కలిసి పోరాటం చేయడం అనేది… సాధ్యమయ్యే వ్యవహారం కాదనే అనిపిస్తోంది.
ప్రత్యేక హోదా అనేది ప్రజా ప్రయోజన అంశం. కానీ, దానిపై పోరాటం అనేది మాత్రం రాజకీయాంశం! ఇంకాచెప్పాలంటే, వచ్చే ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించబోతున్న అత్యంత కీలకాంశం. అలాంటప్పుడు, రాజకీయ పార్టీలు ఏవైనా సరే, తామే పోరాడుతున్నాం అని చెప్పుకుంటాయిగానీ, కలిసి పోరాడతాం అని క్రెడిట్ షేరింగ్‌కు సిద్ధపడవు కదా! అందుకు, పవన్ కల్యాణ్ కూడా అతీతుడు కారు కదా! జగన్ అంతకంటే కాదు..!