స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్ చూసి ఔరా అనుకుంటున్నాయి రాజకీయవర్గాలు. యువత ఒక లక్ష్యం, ఏకాగ్రతతో పనిచేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారట.. కానీ ప్రభుత్వం ఆ దిశగా సహకరించడం లేదట. ఏపీ యువత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఫీజులు చెల్లించడం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం మేల్కొనాలన్నారు.
జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన ఏపీ యువతకు పీడకల. ఉరిమే ఉత్సాహంతో ఉండే లక్షల మంది యువతను ఐదువేలకు పని చేసే వాలంటీర్లుగా మార్చి వారి జీవితాలతో చెలగాటమాడారు. వారి జీవితాల్లో అత్యంత విలువైన ఐదు సంవత్సరాలు వృధా అయ్యాయి. అలాగే వార్డు,గ్రామ సచివాలాయల పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలో కాదో తెలియని ఉద్యోగాలిచ్చి మరికొన్ని వేల మంది యువత మంచి కెరీర్లను వదులుకుని వచ్చి నష్టపోయేలా చేశారు. పోనీ ఐదేళ్ల పాటు పెట్టుబడులు సమీకరించి ఏమైనా ప్రైవేటు ఉద్యోగాలు కల్పించారా అంటే.. విశాఖ రాజధాని పేరుతో ఐటీ కంపెనీలను తరిమేశారు. తీసివేతలే కానీ సృష్టించిన ఉద్యోగాలు లేవు. డీఎస్సీ వేయలేదు. ఉద్యోగ నియామకాలు లేవు.
ఆంధ్రప్రదేశ్ యువతను జగన్ తన కట్టు బానిసలుగా చేసుకుందామని ప్లాన్ చేశారు. తాము ఇచ్చే చిల్లరకు ఆశపడి .. వాటితో గడుపుతూ.. తనకు ..తన పార్టీకి జీవితాంతం సేవ చేస్తూ ఉండేలా చేయాలనుకున్నారు. వారి జీవితాలను నాశనం చేశారు. ఇప్పటికైనా ఆ వాలంటీర్ల జీవితాలను .. యువత భవిష్యత్ ను నాశనం చేసినందుకు జగన్ క్షమాపణ చెబితే వారు కాస్త అయినా క్షమించే అవకాశం ఉంటుంది. వాడుకుని వదిలేసినట్లుగా వదిలేస్తే.. వివేకానందజయంతి సందర్భంగా మరోసారి జగన్ తమకు చేసిన అన్యాయన్ని గుర్తు చేసుకుంటారు. భవిష్యత్ లో వారి కోపం చూపిస్తారు.