ప్రతి ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరస్ సదస్సులో పాల్గొని.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు కేటీఆర్ ప్రతీ సారి వెళ్తూంటారు. ఈ ఏడాది కూడా వెళ్తున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్-2023లో కేటీఆర్ పాల్గొననున్నారు.
2018 సంవత్సరంలో మొదటిసారి ఐటీ మినిస్టర్ హోదాలో కేటీఆర్.. దావోస్ పర్యటనకు వెళ్లారు. అప్పట్నుంచి ప్రతీ సారి వెళ్తున్నారు. ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈవోలు పాల్గొనే ఈ సమ్మిట్‌లో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచే విధంగా కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. గత ఏడాది కరోనా కారణంగా జనవరిలో జరగాల్సి సమావేశాలు ఆలస్యంగా జరిగాయి. ఈ సారి మాత్రం జనవరిలోనే జరుగుతున్నాయి.
గత మేలో జరిగిన సమావేశాలకు సీఎం హోదాలో జగన్ తొలి సారిగా హాజరయ్యారు. అక్కడి నుంచి వేల కోట్లు పెట్టుబడులు తెచ్చామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అయితే అక్కడ కూడా ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో జైల్లో ఉన్న శరత్ రెడ్డి.. వంటి వారితోనే ఒప్పందాలు చేసుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తూంటారు. ఏపీలో ప్రపంచ పెట్టుబడిదారులకు ఉన్న అవకాశాలను వివరించడంలో ఆయన విఫలమయ్యారని .. సమాధానాలు చెప్పలేకపోయిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే కేటీఆర్ మాత్రం అనర్గళంగా ప్రసంగిస్తూ తమ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు.
గతంలో జరిగిన చేదు అనుభవాలతో జగన్ ఈ సారి స్విట్జర్లాండ్ ఆలోచన చేయడం లేదని చెబుతున్నారు. తాము త్వరలోనే విశాఖలో భారీ ఇన్వెస్టర్ల మీట్ నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో దావోస్ వెళ్లి ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తే.. విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది. కానీ జగన్ మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారో లేదో స్పష్టత లేకుండా పోయింది.