ఏపీ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను తన ఖాతాలో వేసుకోవడానికి జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేస్తున్న ప్రయత్నాలు అందరూ పాపం ఎంత కష్టం అనుకుంటున్నారు. ఐదు సంవత్సరాల ఆయన పాలనలో పైసా పెట్టుబడి తీసుకు రాకుండా.. చేస్తున్న పనులన్నీ నిలిపివేసి..పెట్టుబడులు తరిమేసి దోపిడీ పాలన చేసిన ఆయన ఇప్పుడు ప్రభుత్వం అన్ని పనులు చేస్తూంటే..మేమే మేమే అని చెప్పుకుంటూ వస్తున్నారు. వీరి సిగ్గులేని తనం చూస్తూంటే.. రేపు అమరావతి, పోలవరం విషయంలోనూ ఏ మాత్రం సిగ్గుపడకుండా మా వల్లే అని ప్రచారం చేసుకుంటారని ఊహించడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే జగన్ రెడ్డి క్రెడిట్ చోరీని జన జన్మహక్కు అనుకుంటారు.
ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పనీ చేయించని జగన్
అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షాలు సాధారణంగా ప్రభుత్వ వైఫల్యాల కోసం వెతుకుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రూటు వేరు. ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను చూసి తట్టుకోలేకనో లేక ఆ విజయాల వెనుక ఉన్న సానుకూలతను డైవర్ట్ చేయడానికో గానీ.. ప్రతి ఘనతను తమ ఖాతాలో వేసుకోవడానికి జగన్ రెడ్డి అండ్ కో ప్రయత్నిస్తోంది. గూగుల్ పెట్టుబడులు, భోగాపురం పనులు, కుప్పం జలాలపై ఇప్పటికే క్రెడిట్ యుద్ధం” మొదలుపెట్టిన వైసీపీ, రేపు అమరావతి, పోలవరం, వెలిగొండ వంటి కీలక ప్రాజెక్టులు పూర్తయితే.. వాటిని కూడా తామే చేశామని క్లెయిమ్ చేసినా ఆశ్చర్యం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రేపు అమరావతి క్రెడిట్ చోరీకి రెడీ !
ఐదేళ్లు అమరావతిని గ్రాఫిక్స్ అని అడవి అని, స్మశానం అని ఒక్క సామాజిక వర్గానికే మేలు చేసే రియల్ ఎస్టేట్ మాఫియా అని జగన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాజధాని నిర్మాణాన్ని ఐదేళ్ల పాటు పూర్తిగా అడ్డుకున్నారు. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధులు తెచ్చి, పనులను పరుగులు పెట్టిస్తున్నారు. మరో ఏడాదిన్నరలో ఓ రూపం వస్తుంది. అందుకే అమరావతి కూడా మా ఘనతే అని చెప్పుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీలో మీడియాలో మెల్లగా మేము అప్పుడే రోడ్లు వేశాం, అందుకే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి.. రాజధానిపై మాకూ ప్రేమ ఉంది అనే ప్రచారం చేసుకుంటున్నారు. రాను రాను.. అమరావతి పనులు పూర్తయ్యే సమయానికి జగన్ రెడ్డి నా వల్లే అని అక్కడ తిరగినా ఆశ్చర్యం ఉండదు.
పోలవరం, వెలిగొండ విషయంలోనూ అదే నాటకం!
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపారన్న విమర్శలు జగన్ ప్రభుత్వంపై బలంగా ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణమైన వైసీపీ పాలన, ఇప్పుడు ప్రాజెక్టు పనులు వేగవంతం కాగానే.. ఆ పనులు మా హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులను సైతం అసంపూర్తిగా వదిలేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేసి నీరు విడుదల చేస్తుంటే.. ఆ ఘనత జగన్ దేనని వైసీపీ కథనాలు వండటం వైసీపీ ప్రచార వ్యూహంలో భాగమేన . క్రెడిట్ చోరీకి ముందస్తు ప్రణాళిక అన్నమాట.
అంగీకరించక తప్పని ప్రభుత్వ పనితీరు!
ఈ క్రెడిట్ కోసం చేసే ఆరాటంలో వైసీపీ ఒక నిజాన్ని ఒప్పుకుంటోంది. అదేమిటంటే.. ప్రస్తుత ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని! ఒకవేళ గూగుల్ పెట్టుబడి రాకపోయినా, కుప్పంకు నీళ్లు వెళ్లకపోయినా వైసీపీకి విమర్శించే అవకాశం ఉండేది. కానీ ఆ విజయాలు కళ్ల ముందు కనిపిస్తుండటంతో.. ప్రభుత్వం పని చేయడం లేదు అని చెప్పలేక ఆ పని చేసింది మేమే అని చెప్పుకోవాల్సిన దైన్య స్థితికి వైసీపీ చేరుకుంది. జగన్ ఇలాంటి విషయాల్లో అయినా నిజాయితీగా ఉండాలి. తన విధానానికి కట్టుబడి ఉండాలి. మంచి జరిగితే నేనే చేశానని చెప్పుకోవడం .. చేతకానితనం. కానీ జగన్ కు అదొక్కటే చేతనైంది. అదే ఏదైనా చోరీ చేయడమే.
