కోట దాటి బయటకు రా.. కోటరీని పక్కన పెట్టు.. జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకో అప్పుడే నీ బతుకేందో తెలుస్తుంది అని విజయసాయిరెడ్డి చాలా సార్లు జగన్ కు చిలక్కి చెప్పినట్లుగా చెప్పారు. కానీ ఆయన మాటలు దున్నపోతు మీద జడివాడ పడినట్లుగానే తీసుకున్నారు వైసీపీ అధినేత. ఇప్పటికీ జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. కనీసం సొంత నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం లేదు. తాను అనుకున్నదే నిజం.. తాను చేసేదే రాజకీయం అని వెళ్లిపోతున్నారు. మళ్లీ తిరిగి రాలేనంతగా వెళ్లిపోతున్నారని ఆయనకూ అర్థం కావడం లేదు.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా లేని రాజకీయం
జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు. అంతకు ముందు ముందస్తు ఎన్నికలు అని ఆశపడ్డారు. ఇప్పుడు మరో మూడేళ్లు అంటున్నారు. మూడేళ్లు కాదు.. జగన్ రెడ్డి చేసిన అరాచకాలు ప్రజలకు గుర్తున్నంత కాలం ఓటు వేయాలంటేనే భయపడతారు. ఎప్పటికప్పుడు ఆయన తన ఘోరాల్ని గుర్తు చేస్తూనే ఉన్నారు కాబట్టి టీడీపీకి పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవు. ఎవరైనా ప్రజలు ఏమనుకుంటున్నారు.., వారి కష్టాలేమిటి.. నష్టాలేమిటి.. వారికి అనుగుణంగా ఎలా రాజకీయం చేయాలన్నది ఆలోచిస్తారు. దానికి అనుగుణంగా మారతారు. కానీ జగన్ రెడ్డి మాత్రం ఎలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకోరు. తన పిచ్చి రాజకీయాలే గొప్ప అనుకుంటారు.
కనీసం పార్టీ నేతల అభిప్రాయాలూ వినరా ?
ఓ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే రాజకీయంలో గెలుపోటముల్ని నిర్ణయించేది ప్రజలే. రాజకీయ నేతలకు బలం అంటే ప్రజాబలం. వారిని పరిగణనలోకి తీసుకోకపోతే రాజకీయాలు చేయడం అనవసరం. కానీ జగన్ తానే పుడింగి అనుకుంటారు. ప్రజలు తనకు ఓట్లేయడం వారి బాధ్యత అనుకుంటారు. అక్కడే అసలు సమస్యలు వస్తున్నాయి. కానీ వాటిని పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. కనీసం ఎంపీటీసీగా పని చేసే వారు కూడా తమ వార్డు ప్రజల గురించి ఆలోచిస్తారు. జగన్ లో అలాంటి లక్షణాల్లేవు. పార్టీ నేతలు కూడా ఎవరైనా చెప్పాలనుకుంటే వారికి శంకరగిరి మాన్యాలు ఎదురొస్తాయి.
కోట..కోటరీ గుప్పిట్లో ఉంటే ఎప్పటికైనా ఇంతే !
రౌడి షీటర్లకు పరామర్శపై జగన్ రెడ్డిపై వచ్చిన వ్యతిరేకత ఎంతో .. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే జగన్ రెడ్డి రాజకీయాలు వదిలేసుకుంటారు. ఏ మాత్రం తెలియని, చేత కాని రాజకీయాలు చేస్తున్నందుకు సిగ్గుపడతారు. కానీ ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయరు..కోటరీ కూడా చెప్పదు. రోజురోజకు అందర్నీ దూరం చేసుకుంటూ. .. కేలవం కోటరీనే అన్నట్లుగా సాగిపోతున్న ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఎవరూ అనుకోరు.