జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం కోసం పెద్దగా ప్రయత్నిస్తున్నట్లుగా లేదు. ఇతర పార్టీల మద్దతు కూడా కోరడం లేదు. టీడీపీకి ఎంతో కొంత బలం ఉందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. టీడీపీ.. ఎన్డీఏ కూటమిలో ఉంది. అయినా సరే బీజేపీ నేతలు ఇప్పటి వరకూ మద్దతు కావాలని చంద్రబాబును కానీ మరో టీడీపీ ముఖ్యనేతను కూడా సంప్రదించలేదు.
మద్దతు అడిగితే ఇవ్వండని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు చెప్పి పంపించారు. కానీ బీజేపీ నేతలు అడగడం లేదు. అసలు తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడు లేరు. నేరుగా చంద్రబాబును అడగడానికి అవకాశం దొరకదు. లోకల్ లో ఎవరు బాధ్యత తీసుకుని మద్దతు ప్రకటిస్తారో ఎవరికీ తెలియదు. అదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇంకా బీజేపీకి మద్దతుగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
కానీ తెలంగాణ బీజేపీ నేతల్ని.. జనసేన పార్టీ తెలంగాణ నేతలు కలిసి మద్దతు ప్రకటించారు. పవన్ నుంచి ప్రకటన రాకపోతే ఈ మద్దతును అంత అధికారికంగా భావించే అవకాశం లేదు. పోలింగ్ కు ఒకటి రెండు రోజుల ముందు మద్దతు ప్రకటించినా..దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కష్టమవుతుంది. ఇప్పటికే మద్దతు ప్రకటన ఆలస్యమయిందని భావిస్తున్నారు. అయితే పై స్థాయి నుంచి ప్రకటన రాలేదని.. ఎన్డీఏలో పార్టీలే కాబట్టి.. మద్దతిస్తాయని చెప్పుకోవడంతోనే సరిపోతుందని అంటున్నారు.ఇప్పటికే బీజేపీ ప్రచారంలో టీడీపీ, జనసేన జెండాలు కనిపిస్తున్నాయి.