మోదీ టూర్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారా ? పీఎంవో విడుదల చేసిన ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ లో కేసీఆర్ కూడా పాల్గొంటారని ఉంది. ఎనిమిదో తేదీ ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లనున్నారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ ప్రారంభించనున్నారు. తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు. ప్రధాని అధికారిక పర్యటన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు.
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్ కు మాట్లాడేందుకు సమయం కేటాయించారు. అనంతరం మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అభివృద్ధి పనులు అధికారికం. అందుకే కేసీఆర్‌నూ ఆహ్వానించి .. ప్రసంగించేందుకు సమయం కూడా ఇచ్చారు. అయితే కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే సీఎంవోను సంప్రదించకుండా ఇలా కేసీఆర్ పేరు పెట్టే అవకాశం లేదని ప్రోటోకాల్ గురించి తెలిసిన వారు అంచనా వేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం చెప్పలేదు. సీనియర్ మంత్రి తలసానికి ఆ చాన్సిచ్చారు.
ఈ సారి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేసీఆర్ నిజంగా మోదీకి స్వాగతం చెప్పి ఆయనతో పాటు కార్యక్రమంలో పాల్గొంటే మాత్రం రాజకీయంగా సంచలనం అవుతుంది. కేసీఆర్ హాజరు కాకపోతే.. బీజేపీ విమర్శలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే హాజరైతే కేసీఆర్ మళ్లీ బీజేపీతో కలిసిపోయినట్లుగా ఎక్కువ మంది నమ్ముతారు. ఆయన జాతీయ రాజకీయాలు పలుచన అవుతాయి. అందుకే కేసీఆర్ హాజరు కాకపోవడానికే ఎక్కువ చాన్స్ ఉందని నమ్ముతున్నారు.