ప్రముఖుల్ని చంపడమే మావోయిజమా..?

కొద్ది రోజుల కిందట… మావోయిస్టులు.. రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ వాళ్లు హతమార్చినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నుతున్నారని పుణె పోలీసులు ప్రకటించారు. కానీ మావోయిస్టులు అంత దారుణానికి ఒడి గట్టరగని ప్రజల్లో గట్టి నమ్మకం ఉంది. అందుకే పెద్ద రియాక్షన్ రాలేదు. ఆ కేసు గురించి.. దేశవ్యాప్తంగా కొంత మంది ఉద్యమకారుల్ని అరెస్ట్ చేసినప్పుడు.. ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ప్రజలు స్పందనా అంతే తీవ్రంగా ఉంది. అంటే మావోయిస్టుల భావజాలం పట్ల ప్రజలకు.. అంతో ఇంతో.. ఇంకా నమ్మకం మిగిలి ఉందనే…! కానీ మావోయిస్టులు చేసే హింసను.. ఏ ఒక్కరూ హర్షించరు. తీవ్రంగా ఖండిస్తారు కడా. మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లో చంపేసినప్పుడు.. గొంతెత్తే హక్కుల సంఘాలు కూడా… మావోయిస్టులు.. ఇలా ఏ కారణం లేకుండా.. సంచలనం కోసం.. ఉనికి కోసం.. ఏదో ఓ నింద వేసి.. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్ని చంపితే నోరెత్తరు. తప్పు అనే భావాన్ని వ్యక్తీకరించరు. దాంతోనే… సమస్య ప్రారంభమవుతుంది.

ఇటీవలి కాలంలో మావోయిస్టులు పెద్ద పెద్ద టార్గెట్లను పెట్టుకుని వీఐపీలపై ఎటాక్ చేసిన సందర్భాలు లేవు. అలిపిరి ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి చేసిన తర్వాత.. వారి కదలికలు చాలా వరకు తగ్గిపోయాయి. కానీ చరిత్రలో ఎన్నో సార్లు.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయప్రముఖులను టార్గెట్ చేశారు. చంపేశారు కూడా. ఓ మాగుంట సుబ్బరామిరెడ్డిని చంపినా.. ఓ రాగ్యానాయక్‌ను చంపినా.. మరో శ్రీపాదరావును హత్య చేసినా… మావోయిస్టుల చర్యలకు ప్రజల మద్దతు ఎప్పుడూ లభించలేదు. రాగ్యానాయక్ ను చంపేసినప్పుడు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి క్షమాపణలు కూడా చెప్పారు. అయినా సరే.. తమ హింసాత్మక ధోరణిలో.. ఏ మాత్రం మార్పు తెచ్చుకోలేదు…మావోయిస్టులు.

గిరిజన ఎమ్మెల్యేలను చంపడం అంటే మావోయిస్టులు.. తమ సిద్ధాంతాలను తాము చంపుకోవడమే. ఓ గిరిజన ఎమ్మెల్యే..మరో మాజీ ఎమ్మెల్యేను అకారణంగా సంచలనం కోసమే.. తమ ఉనికిని ఘనంగా చాటుకోవడం కోసమే చంపడటం.. అంటే.. అది వారి దుస్థితిని తెలియజేస్తుంది. ఇలాంటి హత్యల వల్ల మావోయిస్టులు ప్రజల్లో సానుభూతిని ఎప్పటికప్పుడు కోల్పోతూ వస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో… ఇన్ఫార్మర్ల నెపంతో కొంత మందిని హత్య చేసి గ్రామస్తులను భయపెట్టి.. కొంత మేర.. పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వారి అండతోనే.. ఇప్పుడు అంతో ఇంతో.. మనుగడ సాగించగలుగుతున్నారు. నాయకత్వం వృద్ధతరానికి మారిపోయి.. కొత్తగా యువత మావో భావజాలంపై ఆసక్తి చూపించకపోవడం… వచ్చే వారు నిర్బంధంగా.. తప్పని సరి పరిస్థితుల్లో వచ్చే వారు కావడంతో.. మావోయిస్టు సిద్ధాంతాలు అంతకంతకూ అంతర్థానమైపోతున్నాయి. ఇలాంటి హత్యలతో వారు.. ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వారుగా కాకుండా.. సంఘ విద్రోహశక్తులుగా.. సమాజం దృష్టిలో పడిపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. రేపు ఎప్పుడైనా బలగాలు.. వీరిని అత్యంత దారుణంగా చంపినా.. ప్రజల నుంచి కనీస సానుభూతి కూడా రాకపోవచ్చు.

—–సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com