‘పెద్ది’ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాతలు ఏం ముట్టుకొన్నా అది బంగారం అయిపోతోంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది. పెద్ది గ్లింప్స్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అందులో చరణ్ బ్యాటింగ్ స్టైల్.. బాగా వైరల్ అయ్యింది. ఆ తరవాత విడుదల చేసిన ‘చికిరి’ పాట సోషల్ మీడియాను షేక్ చేసేసింది. 100 మిలియన్ల వ్యూస్ సంపాదించుకొని.. తన తడాఖా చూపించింది. ఈ పాటతో పెద్దిపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ‘పెద్ది’ కోసం రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకొన్నారంటే ఆశ్చర్యపోయి, అనుమానించినవాళ్లంతా ఇప్పుడు రెహమాన్ కరెక్ట్ ఆప్షన్ అని కితాబు ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ది నుంచి రెండో పాట కూడా రాబోతోంది. డిసెంబరులో ఈ పాటని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ సమయంలో ఈ పాట బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ పాట వేరే స్థాయిలో ఉంటుందని, ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘చికిరి’ అనే పాట కేవలం ఓ మెచ్చుతునకే అని… ఇక రాబోయే పాటలన్నీ అంతకు మించి ఉంటాయని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. అందుకు సంబంధించిన లిరికల్ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం.
‘చికిరి’ పాటతో రెహమాన్ కు మంచి కమ్ బ్యాక్ దక్కినట్టే అనుకోవాలి. ఎందుకంటే.. కొంతకాలంగా ఆయన్నుంచి వస్తున్న ఏ పాట కూడా జనాల్ని ఇదివరకటిలా మెస్మరైజ్ చేయట్లేదు. తెలుగు సినిమా పల్స్ ని, మాస్ హీరోల క్రేజ్‌ని రెహమాన్ సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడన్న ఓ విమర్శ వుంది. అయితే ‘చికిరి’ పాటతో వాటికి పుల్ స్టాప్ పడినట్టే. ఈ ఆల్బమ్ రెహమాన్ ప్రయాణంలోనూ చాలా కీలకంగా మారబోతోంది. ‘చిరికి’లా రెండో పాట కూడా చాట్ బస్టర్ అయితే తెలుగులో బడా హీరోలకు రెహమాన్ మళ్లీ మరో ఆప్షన్ గా నిలిచే ఛాన్స్వుంది. ఎందుకంటే ఇప్పటికే దేవిశ్రీ, తమన్లతో పాటలు చేయించేసుకొన్నారు మన స్టార్ హీరోలు. కొత్త ఆప్షన్ల కోసం అన్వేషిస్తున్నారు. రెహమాన్ తో పని చేయాలని ప్రతీ హీరోకీ ఉంటుంది. కానీ రెహమాన్ ఫామ్ చూసి వెనకడుగు వేస్తున్నారు. `పెద్ది`తో రెహమాన్ ఫామ్ లోకి వస్తే.. ఇక పెద్ద హీరోలకు మరో ఆప్షన్ దొరికినట్టే.
