ఒకప్పుడు రీ-రిలీజ్ అంటే పాత క్లాసిక్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సూపర్ హిట్ అయిన సినిమాలను కొత్త ఫార్మాట్లలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు అదే ప్రయోగం ‘హనుమాన్’ విషయంలో జరుగుతోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో చిత్రం 3డీ వెర్షన్లో విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 25న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా 3డీలో ట్రైలర్ కూడా వదిలారు. వచ్చే వారం బాక్సాఫీసు దగ్గర పెద్దగా సినిమాలేం రావడం లేదు. అది… హనుమాన్ త్రీడీకి ప్లస్ అయ్యే ఛాన్స్ వుంది.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి ఉంది. ఇప్పటికే థియేటర్లలో చూసినవారు, ఓటీటీలో ఎన్నిసార్లో చూసినవారు.. కేవలం 3డీ అనుభవం కోసం మరోసారి టికెట్ కొని చేసి థియేటర్‌కు వస్తారా అనేది ఆసక్తికరం. ‘హనుమాన్’ సాధారణ సినిమా కాదు. చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, హనుమంతుడి భక్తి నేపథ్యం, సూపర్ హీరో ఎలిమెంట్స్ అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ ప్రేక్షకుల్లో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. అందుకే 3డీ వెర్షన్‌కు కనీస స్థాయిలో ఆసక్తి ఉండడం ఖాయం.
కాకపోతే సినిమా విడుదలై ఎంతో కాలం కాలేదు. ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటి ప్రేక్షకుడు థియేటర్‌కు రావాలంటే కొత్తదనం కావాలి. కేవలం “3డీ వెర్షన్” అనే ఒక్క కారణంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని భావించడం కాస్త అత్యాసే. గతంలో ‘అవతార్’, ‘గ్రావిటీ’ లాంటి సినిమాలు 3డీ అనుభవం వల్లే మళ్లీ చూడాలనిపించాయి. ఎందుకంటే వాటి విజువల్ డిజైన్ పూర్తిగా ఆ ఫార్మాట్ కోసం రూపొందించారు. ‘హనుమాన్’ మాత్రం మొదట 2డీ అనుభవానికే రూపొందిన సినిమా. ఇప్పుడు దాన్ని 3డీకి కన్వర్ట్ చేశారు. త్రీడీ హంగులతో తీసిన సినిమాకీ, త్రీడీగా మార్చిన సినిమాకు చాలా తేడా ఉంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి లభించినా, అది పూర్తిగా కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఇవ్వకపోవచ్చు.
ఇక్కడ నిర్మాతల లెక్కలు వేరుగా ఉంటాయి. హనుమాన్ కు ఉన్న బ్రాండ్ వాల్యూ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలదన్నది వాళ్ల నమ్మకం. పెద్దగా ప్రమోట్ చేయాల్సిన పనిలేదు. త్రీడీ వెర్షన్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు కూడా అవ్వదు. అందువల్ల భారీ కలెక్షన్లు రాకపోయినా, పరిమిత ఖర్చుతో మంచి రికవరీ సాధించే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ 3డీ రిలీజ్ వెనుక అసలు ఉద్దేశం కలెక్షన్ల కంటే బ్రాండ్‌ను మళ్లీ ప్రజల్లో చర్చకు తీసుకురావడమే. ‘జై హనుమాన్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాకు ముందు ‘హనుమాన్’ను మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేయడం కూడా ఈ రీ-రిలీజ్ ద్వారా సాధ్యమవుతుంది.
‘హనుమాన్’ 3డీ వెర్షన్‌కు ఆసక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టిస్తుందా అంటే సమాధానం అంత సులభం కాదు. ఇప్పటికే చూసిన ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో థియేటర్లకు రప్పించడం కష్టమే. అయితే ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు, అభిమానుల మద్దతుతో పరిమిత స్థాయిలో మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ రీ-రిలీజ్ విజయాన్ని కలెక్షన్లతో కాకుండా, ‘హనుమాన్’ బ్రాండ్‌ను మరోసారి ఎంత బలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిందనే కోణంలో చూడాల్సి ఉంటుంది.
