తెలుగుదేశం పార్టీ వార్షిక పండగ మహానాడు నిర్వహణపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 2026 మే 27 నుంచి 29 వరకు నెల్లూరు వేదికగా ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల కారరణంగా పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన పొదుపు చర్యల ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
నెల్లూరులో భారీ ఏర్పాట్లు.. కానీ సందిగ్ధంలో నాయకత్వం
మహానాడు కోసం నెల్లూరులోని కొడవలూరు మండలం ఇఫ్కో ప్రాంగణంలో ఇప్పటికే 150 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సుమారు 5 లక్షల మంది హాజరవుతారని మంత్రులు పి.నారాయణ తదితరులు అంచనా వేశారు. అయితే, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు , దేశీయంగా పొదుపు పాటించాలన్న ప్రధాని సూచనల మేరకు చంద్రబాబు ఇప్పటికే తన కాన్వాయ్‌ను తగ్గించుకోవడంతో పాటు అనవసర ఖర్చులకు చెక్ పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో కోట్లాది రూపాయల వ్యయంతో అట్టహాసంగా మహానాడును నిర్వహించడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ప్రత్యామ్నాయాలపై లోకేశ్ ఫోకస్
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నారా లోకేశ్ ఈ అంశంపై పార్టీ నేతలతో నిరంతరం చర్చిస్తున్నారు. భారీ బహిరంగ సభను నిర్వహించాలా లేక కేవలం ప్రతినిధుల సభతోనే ముగించాలా అన్న అంశంపై త్వరలో జరగబోయే స్ట్రాటజీ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పొదుపు మంత్రం పాటిస్తే, కేవలం పార్టీ ముఖ్య నేతలు, ప్రతినిధులతోనే సభను పరిమితం చేసి, మిగిలిన శ్రేణుల కోసం వర్చువల్ పద్దతిలో నిర్వహించే అవకాశం కూడా ఉందని సోషల్ మీడియాలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సామాన్యుడికి చేరువగా.. ఆడంబరాలకు దూరంగా
అధికారంలో ఉన్న సమయంలో ఆడంబరాలకు పోకుండా, పార్టీ పండుగను కూడా సాదాసీదాగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఒక మంచి ఇంప్రెషన్ కలిగించవచ్చని టీడీపీ స్ట్రాటజీ టీమ్ సూచిస్తోంది. ముఖ్యంగా పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున భోజన వసతులు, హోటల్ రూమ్‌ల బుకింగ్‌లు ఇప్పటికే మొదలైనప్పటికీ, అధిష్టానం నుంచి వచ్చే స్పష్టమైన సంకేతాల కోసం స్థానిక నేతలు ఎదురుచూస్తున్నారు.
