గత రెండు నెలలుగా ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న టీమిండియా ఇంగ్లీష్ జట్టుకి గట్టి పోటీ ఇస్తుంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ లో రెండు మ్యాచులు గెలిచి ఆతిథ్య జట్టు లీడింగ్‌లో ఉంది. ఒక మ్యాచ్ భారత్ గెలవగా మరో మ్యాచ్ డ్రా అయింది. ఇప్పుడు ఆఖరి టెస్ట్ ఆఖరి రోజుకి చేరుకుంది. ఇప్పటికీ భారత్ జట్టుకి ఈ మ్యాచ్‌ని గెలిచి సిరీస్‌ని డ్రా చేసే అవకాశం ఉంది. అయితే అలా జరగాలంటే ఒక అద్భుతం జరగాలి.
ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు 35 పరుగులు అవసరం. భారత్ నాలుగు వికెట్లు తీస్తేనే విజయం సాధిస్తుంది. నిన్న నాలుగో రోజు వర్షం కారణంగా మ్యాచ్ త్వరగా ముగిసింది. హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలు సాధించడంతో ఒక దశలో భారత్ ఓటమి దిశగా సాగుతోందా? అనిపించింది. అయితే, వారిద్దరినీ ఔట్ చేయడంతోపాటు బెతెల్ వికెట్ తీయడంతో మళ్లీ భారత్ రేసులోకి వచ్చింది. ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది.
4 వికెట్లు, 35 పరుగులు… ఈ ఈక్వేషన్ బోర్డ్ మీద ఈజీగా కనిపించవచ్చు కానీ టెక్నికల్ గా కొన్నిసార్లు కష్టం. చాలా సందర్భాల్లో టాప్ ఆర్డర్ 30 పరుగులకు కూలిపోవడం చూశాం. ఇప్పుడు ఇంగ్లిష్ టెయిలెండర్లు ఆడుతున్నారు. మరో నాలుగు ఓవర్లలో మనకి న్యూబాల్ కూడా దొరుకుతుంది. న్యూబాల్‌తో మ్యాచ్ ఏమైనా కావచ్చు. తొలి రెండు ఓవర్లలో ఒక వికెట్ తీయగలిగితే ఇంగ్లాండ్ పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. నాలుగు వికెట్లలలో వోక్స్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ వస్తే… కేవలం వికెట్ల ముందు నిలబడటానికే పనికొస్తాడు. టెక్నికల్ గా మూడు వికెట్లు మాత్రమే. మరి లాస్ట్ పంచ్ ఎవరిదో చూడాలి.