ఏఆర్ రెహ్మాన్ దేశం గర్వించే మ్యూజిక్ డైరెక్టర్. పాన్ ఇండియా అనే పదం పుట్టకముందే దేశవ్యాప్తంగా తన సంగీతంతో ఉర్రూతలూగించిన కంపోజర్. అయితే కాలంతో పాటు ఆయన సంగీతంలోనూ చాలానే మార్పులు వచ్చాయి. బేసిగ్గా, వయసు పెరిగే కొద్దీ జనరేషన్ గ్యాప్ వల్ల కళాకారులు అవుట్‌డేట్ అవుతారు. కానీ రెహ్మాన్ సమస్య వేరే. ఆయన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో నెక్ట్స్ జనరేషన్ మ్యూజిక్ చేస్తుంటాడు. ఇక్కడే అసలైన చిక్కు వచ్చింది. ఆయన చేసే ట్యూన్స్ ఇప్పుడు మాస్ కి రిజిస్టర్ కావడం లేదు.
గత రెండేళ్లలో అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న రెహ్మాన్ పాటలు ఏమిటి? అనే ప్రశ్నకు టక్కున సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే, గతంలో వచ్చిన చిన్ని చిన్ని ఆశ , అంజలీ అంజలీ , చెయ్య చెయ్యా లాంటి సామాన్యులు పాడుకునే పాటలు ఇప్పుడు రావడం లేదు. అయితే, ఆయన మంచి మ్యూజిక్ చేయడం లేదా అంటే… అదీ కాదు. గత ఏడాది చమ్కిలా సినిమా కోసం చేసిన మెను విదా కరో పాటను వినండి. సినిమా చూస్తూ ఆ పాట వింటే అప్రయత్నంగా కళ్లలో నీళ్లు తిరిగేస్తుంది. అంతగా మనసులో నాటుకు పోతుంది. అలాగే పొన్నియన్ సెల్వన్ లో పొన్ని నది, చోళా, ఆగనందే లాంటి కంపోజిషన్స్ మెస్మరైజింగ్‌గా ఉంటాయి. కానీ వీటిలో ఏవీ మాస్ లోకి రాలేదు.
రెహ్మాన్ ఇప్పుడు వైరల్ సాంగ్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మ్యూజిక్ చేయడం లేదు. కంపోజర్‌గా తనకు కిక్ ఇచ్చే పాటలు చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్గా వచ్చిన థగ్ లైఫ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమాలో పాటలు జనాల్లోకి రాలేదు. అయితే ఇది వరస్ట్ ఆల్బమ్ కాదు. సంగీతంపై అవగాహన ఉన్నవాళ్లు ఆ ట్రాక్స్‌ని రివ్యూ చేస్తే అందులో సారం తెలుస్తుంది. బీజీయం కూడా అదే తరహాలో తయారైంది.
ఇప్పటి జనరేషన్‌కు తమన్, అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లౌడ్ మ్యూజిక్ అలవాటు చేశారు. బీజీయం అంటే బాదేయాలన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్లిపోయింది. కానీ రెహ్మాన్ ఎప్పటి నుంచో లౌడ్నెస్కు దూరంగా ఉంటూ వచ్చారు. రోజా , ముంబై , తాళ్ , దిల్ సే , జెంటిల్మెన్ , భారతీయుడు , రోబో , రాక్‌స్టార్ , శివాజీ .. ఇలా ఏ సినిమా తీసుకున్నా బీజీఎం ట్రాక్స్ పాడుకునేలా వుంటాయి.
ఇప్పుడు థగ్ లైఫ్ చూసాక, రెహ్మాన్ చేస్తున్న నెక్ట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ పెద్ది పై చర్చ మొదలైంది. కొమరం పులి తర్వాత రెహ్మాన్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఒక్కటే సినిమా తీసిన అనుభవం ఉన్న దర్శకుడు బుచ్చిబాబు. రెహ్మాన్ వేవ్‌లెంగ్త్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే పెద్ది ఆల్బమ్ ఎలా ఉంటుందా? అన్న టెన్షన్ రామ్ చరణ్ అభిమానుల్లో మొదలైంది.
మ్యూజిక్ పరంగా ఎంత స్కిల్ ఉన్నా, పాటలు జనరంజకంగా లేకపోతే ఫలితం ఉండదు. బుచ్చిబాబు ఫోకస్ మొత్తం మాస్ ఆకట్టుకునే పాటలపైనే ఉండాలి. రెహ్మాన్ ఎంత మాస్ సాంగ్ చేసినా, అందులో క్లాసిక్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అది కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అజ్ఞాతవాసిలో అనిరుధ్ కూడా ఇదే చేశాడు. ఓ భారీ ఫైట్‌కి వీణ సౌండ్‌ని బీజీయంగా వాడాడు. అది మ్యూజిక్ డైరెక్టర్ టేస్ట్ కావచ్చు. కానీ అలాంటి వ్యక్తిగత అభిరుచులు తగ్గించుకుని మాస్ ఆడియెన్స్‌కు క్యాటర్ చేసేలా మ్యూజిక్ రెడీ చేయాలి.
ఇప్పటివరకు పెద్ది నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది. అందులో మ్యూజిక్ మాస్ మీటర్ లోనే ఉంది. రెహ్మాన్ గురించి ఒక విషయంలో అలోచించాల్సిన పని లేదు. ఆయన నుంచి ఓల్డ్ స్కూల్ మ్యూజిక్ రాదు. కానీ ట్యూన్ రెడీ చేసినప్పుడు పియానోపై ఆయన వేళ్ళు సామాన్య ప్రేక్షకులకి దూరంగా ప్రయోగాల బాట పడతాయి. ఆ ప్రయోగాలకు కాస్త కంట్రోల్ పెట్టి ‘పెద్ది’ కోసం జనరంజకమైన మ్యూజిక్ తీసుకురావడంలో బుచ్చిబాబుదే పూర్తి బాధ్యత.