1983 వరల్డ్ కప్ విజయం ఇండియాలో క్రికెట్ విప్లవానికి కారణం అయింది. మరో ఆటకు చోటు లేకుండా క్రికెట్ ఆక్రమించడానికి ఆ వరల్డ్ కప్ విజయం ఉత్సాహాన్నిచ్చింది. ప్రతీ గల్లీలో ఓ క్రికెట్ టీం పుట్టుకు వచ్చింది. ఇప్పుడు మహిళా క్రికెట్ టీం సాధించిన ప్రపంచకప్ విజయంతో మరోసారి అలాంటి విప్లవమే వస్తున్నట్లుగా కనిపిస్తోంది. పురషులతో పోటీగా మహిళా క్రికెట్ కూడాకోట్లాది మందిని ఆకట్టుకుని .. పురుషుల టీమ్‌కు తగ్గట్లుగానే క్రేజ్ సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
బీసీసీఐలో కలసిపోవడంతో మారిన సీన్
ఒకప్పుడు మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ పేరు తప్పితే ఎవరి పేరూ వినిపించేది కాదు. మిథాలీ పేరు క్రికెట్ పిచ్చి వాళ్లకు మాత్రమే కాస్త పరిచయం. అప్పట్లో ఆటకు అంత ఆదరణ ఉండేది కాదు. 2006కి ముందు బీసీసీఐ కూడా మహిళా టీమ్‌ను పట్టించుకోలేదు. ఆర్థిక సమస్యలతో మహిళా క్రికెట్ టీం చాలా సమస్యలు ఎదుర్కొనేది. కానీ 2005లో ఇంటర్నేషనల్ విమెన్స్ కౌన్సిల్ ఐసీసీలో విలీనం అయి.. మహిళా క్రికెట్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2006లో మహిళా క్రికెట్ టీం కూడా బీసీసీఐ గొడుగు కిందకు వచ్చింది. నిజానికి బీసీసీఐ విముఖత చూపించింది. కానీ ఐసీసీ నిర్ణయంతో తప్పలేదు.
క్రమంగా పెరుగుతూ వచ్చిన ప్రమాణాలు
ఒకప్పుడు మహిళా క్రికెట్ అంటే అత్యల్ప స్కోర్ల టోర్నీలు. కానీ రోజులు పెరుగుతున్న కొద్దీ మహిళా క్రికెట్ లో నాణ్యత పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అన్ని జట్లూ పురుషుల టీమ్ ను మరింపించేలా ప్రదర్శన చేస్తున్నారు. అత్యుత్తమ ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు. ఫీల్డింగ్ , బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో వారు చూపిస్తున్న ప్రతిభ, ఆటగాళ్ల ఫిట్నెస్ .. ఉన్నత స్థాయిలో ఉంటున్నాయి. అందుకే ప్రేక్షకులు కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచకప్ విజయంతో అందరూ స్టార్ క్రికెటర్లుగా మారిపోయారు.
ఇక మహిళా క్రికెట్ మ్యాచ్‌లకూ క్రేజ్ పెరిగినట్లే !
ఇక నుంచి భారత మహిళా క్రికెట్ జట్టు ఏ దేశంతో ఆడినా.. పురుషుల టీమ్ కుఎంత ప్రయారిటీ వస్తుందో అంత వస్తుంది. కొన్నాళ్లకు మహిళల టీమే డామినేట్ చేసినా ఆశ్చర్యం ఉండదు. క్రమబద్ధంగా ప్రమాణాలు పెంచుకుటూ వచ్చిన ఫలితం ఇప్పుడు మహిళా క్రికెట్ టీమ్‌కు ఎంతో చేసింది. అత్యున్నత శిఖరాలను అందుకుంటోంది. ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్ కెరీర్ ను ఎంచుకోవడానికి నుంచి ఆసక్తి చూపిస్తారు.
