తెలంగాణ ప్రభుత్వం మహిళల పేరు మీద ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రాయితీ ఇచ్చే ఆలోచన చేస్తోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌లో మహిళలకు స్టాంప్ డ్యూటీలో రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త స్టాంప్ విధానంలో భాగంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య లావాదేవీలలో పారదర్శకత, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కొత్త స్టాంప్ విధానాన్ని రూపొందిస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ఈ విధానంలో ప్రజలకు కొన్ని ప్రయోజనకర అంశాలు ఉండనున్నాయి. పాత అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టాంప్ డ్యూటీలో వెసులుబాటు కల్పించే ఆలోచన కూడా ఉందిని మంత్రి చెబుతున్నారు. కొత్త స్టాంప్ విధానం ద్వారా రాష్ట్రంలో ఆస్తి రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, పౌర సమాజానికి అనుకూలంగా , ఆధునికంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు స్టాంప్ డ్యూటీలో రాయితీ ఇవ్వడం ద్వారా ఆస్తి రిజిస్ట్రేషన్‌లో వారిని ప్రోత్సహించినట్లుఅవుతుంది. ఇప్పటికే బ్యాంకులు మహిళలకు కాస్త తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇస్తున్నాయి. అదే సమయంలో పాతఅపార్టుమెంట్లలకు రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ ఇస్తే.. సెకండ్ హ్యాండ్ ఇళ్ల అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటాయనిఅంచనా వేస్తున్నారు.