కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు దేశవ్యాప్తంగా మహిళల్లో హర్షాతిరేకాలను నింపినప్పటికీ, దాని వెనుక ఉన్న సాంకేతిక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ బిల్లు అమలు కావాలంటే కొత్త జనాభా లెక్కలు , నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరని చట్టంలో పేర్కొన్నారు. ఈ అంశంపైనా రాజకీయ స్పందన భిన్నంగా వస్తోంది. మహిళా సాధికారత అనే భావోద్వేగ అంశాన్ని హైలైట్ చేస్తూనే, దాని మాటున సున్నితమైన డీలిమిటేషన్ ప్రక్రియను ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయాలన్నది కేంద్ర వ్యూహంగా కనిపిస్తోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మోదీ తన వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు.
మహిళా రిజర్వేషన్ల గురించే మాట్లాడుతున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పత్రికా వ్యాసాల ద్వారా మహిళా గౌరవం ఏకాభిప్రాయం గురించి పిలుపునివ్వడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంది. మహిళా రిజర్వేషన్లకు ఏ పార్టీ కూడా బాహాటంగా వ్యతిరేకత తెలపలేదు. ఈ ఏకాభిప్రాయాన్ని ఆధారంగా చేసుకుని, డీలిమిటేషన్ ప్రక్రియను కూడా ఒకే ప్యాకేజీగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్తులో వచ్చే చిక్కులను అధిగమించాలని బీజేపీ భావిస్తోంది. అయితే, కేవలం మహిళా బిల్లును సాకుగా చూపి డీలిమిటేషన్ లాంటి భౌగోళిక, రాజకీయ మార్పులను రుద్దడం సరైన పద్ధతి కాదనే వాదన బలంగా వినిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు పట్టించుకోవాలి!
దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఇక్కడ అత్యంత కీలకం. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజన వల్ల తమ పార్లమెంట్ సీట్లను కోల్పోతామని భయపడుతున్నాయి. ఇది కేవలం సీట్ల సంఖ్యకు సంబంధించిన విషయం కాదు, జాతీయ రాజకీయాల్లో దక్షిణాది గళం బలహీనపడటం, నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందనే సెంటిమెంట్ ఇప్పటికే రగులుతోంది. ఈ చర్చ బహిరంగంగా జరిగితే ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని భావిస్తున్న కేంద్రం, మహిళా బిల్లు ద్వారా దీన్ని సున్నితంగా దాటవేయాలని ప్రయత్నిస్తోంది.
నిజానికి, డీలిమిటేషన్ అనేది దేశ సమగ్రతకు సంబంధించిన అంశం. దీనిపై విస్తృతంగా చర్చ జరగడమే మంచిది.
ముసుగులో పూర్తి చేయడం మంచి వ్యూహం కాదు!
కేవలం ఒక ప్రాంతానికి మేలు చేస్తున్నామనే అభిప్రాయంతో పూర్తి చేస్తే, అది సమస్యను పరిష్కరించకపోగా మరింత జటిలం చేస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా అదనపు బలం చేకూరి, దక్షిణాది రాష్ట్రాలు శిక్ష అనుభవిస్తున్నామనే భావనలోకి వెళ్తే అది దేశ సమాఖ్య వ్యవస్థకు ప్రమాదకరం. అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు తమకు అన్యాయం జరగలేదని విశ్వసించినప్పుడే ఈ ప్రక్రియకు సంపూర్ణ సార్థకత లభిస్తుంది.
బీజేపీ హైకమాండ్ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, మహిళా రిజర్వేషన్లు ఎంత అవసరమో, రాష్ట్రాల మధ్య రాజకీయ సమానత్వం కూడా అంతే ముఖ్యం.
బలవంతపు ఏకాభిప్రాయం కంటే, అన్ని పక్షాలతో చర్చించి దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే ఫార్ములాను రూపొందించాలి. మహిళా బిల్లు అమలులో డీలిమిటేషన్ను లింక్ చేయడం కన్నా.. ఈ రెండింటినీ వేరు చేసి చూడటమో లేదా శాస్త్రీయమైన పరిష్కారాన్ని చూపడమో చేసినప్పుడే దేశానికి నిజమైన మేలు జరుగుతుంది.
