తెలుగులో ఉన్న అతి కొద్దిమంది మంచి గీత రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. ఆయన పద ప్రయోగాలు బాగుంటాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి. భావుకత గొప్పగా ఉంటుంది. క్లాస్, మాస్, టీనేజ్ సాంగ్, టీజ్ సాంగ్.. ఇలా ఏదైనా రాయగలరు. పాటలు రాయడమే కాదు. కొన్నిసార్లు తన అభిప్రాయాన్ని నిస్కర్షగా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలరు. ఆమధ్య ‘కల్కి’ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కర్ణుడి పాత్రని వక్రీకరించారన్నది ఆయన వాదన. సినిమాల కోసం, వినోదం కోసం పురాణాల్ని వక్రీకరించకూడదన్నది ఆయన ఆవేదన. మరోసారి ఇదే అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అప్పట్లో ‘కల్కి’పై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. తెలుగు360కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో తన వాదన మరింత బలంగా వినిపించే ప్రయత్నం చేశారు.
”రామాయణ మహాభారతాలు చరిత్ర. జరిగిన దాన్ని మన భాషలో, మనకు తగ్గట్టు రాసుకొన్నాం. వాటిని మార్చే హక్కు ఎవరికీ లేదు. అలా చెబితేనే వాటి లక్ష్యం నెరవేరుతుంది. మనం చేస్తున్నాం కదా అని చెడ్డ పాత్రని కూడా గొప్పగా రాసుకొని, ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే సహించడం కష్టం. అప్పట్లో నోరు విప్పడానికి ఎక్కువ వేదికలు ఉండేవి కావు. ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి మాట్లాడాల్సివస్తోంది. ఇప్పుడే కాదు.. ఎప్పుడు పురాణాల్ని వక్రీకరించినా ఇలానే మాట్లాడతా” అంటూ తన గళం మరోసారి గట్టిగా వినిపించారు.
అనంత శ్రీరామ్ రాసిన పెద్దిలోని ‘రై.. రై రారా’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో ఆయన మరో మూడు పాటలు రాశారు. అవన్నీ త్వరలో విడుదల కానున్నాయి.