స్టార్ రైటర్.. బుర్రా సాయిమాధవ్ నిర్మాతగా మారారు. ఆయన ఎస్.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించారు. అంటే.. సాయిమాధవ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్రయత్నంగా ఈటీవీ విన్‌తో కలిసి ఓ సినిమాని నిర్మించే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడ్ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి బుర్రా సాయిమాధవ్ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ఇకపై తన నిర్మాణ సంస్థ నుంచి కొత్త దర్శకులకు, ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వాలన్నది ఆయన ప్రయత్నం. మరోవైపు రచయితగా ఫుల్ బిజీలో ఉన్నారు సాయిమాధవ్. చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ‘కల్కి’ చిత్రానికీ ఆయనే రచయిత. క్రిష్ – అనుష్క కాంబినేషన్ లో రూపుదిద్దుకొంటున్న కొత్త చిత్రానికీ మాటలు రాస్తున్నారు. ఇవికాకుండా దాదాపు అరడజను క్రేజీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. `ఎస్.ఎం.ఎస్` సంస్థకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. దర్శకుడు, టైటిల్ తదితర వివరాలు సాయిమాధవ్ స్వయంగా ప్రకటిస్తారు.