రివ్యూ: రైటర్ పద్మభూషణ్

Writer Padmabhushan review

తెలుగు360 రేటింగ్ :2.75/5

సుహాస్ మంచి నటుడు. యూ ట్యూబ్ నుంచి వెండి తెర‌కు ప్ర‌మోష‌న్ పొందాడు. చిన్న చిన్న పాత్ర‌ల నుంచి హీరోగా ఎదిగాడు. ‘కలర్ ఫోటో’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. అయితే ఆ సినిమా ఓటీటీకే పరిమిత అయ్యింది. సుహాస్ తొలి థియేటర్ రిలీజ్ గా ‘రైటర్ పద్మభూషణ్’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిజిటల్ కంటెంట్ క్రియేషన్ లో పాపులరైన ‘చాయ్ బిస్కెట్’ ఈ సినిమాని నిర్మించింది. సుహాస్ జర్నీ కూడా అక్కడే మొదలైయింది. వారం రోజల ముందు నుంచే ప్రిమియర్స్ హ‌డావుడి మొద‌లైపోయింది. కంటెంట్ పై వున్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. మరి రైటర్ పై నిర్మాతలకున్న నమ్మకం ఏమిటి ? ఈ రైటర్ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాల్ని పంచాడు?

పద్మ భూషణ్ (సుహాస్ ) విజయవాడ కుర్రాడు. భూషణ్ తండ్రి మధుసూధన్ (ఆశిష్ విద్యార్ధి) తల్లి సరస్వతి (రోహిణి). భూషణ్ కు పాపులర్ రైటర్ కావాలని కల. నాలుగు లక్షలు అప్పు చేసి ‘తొలి అడుగు’ అనే పేరుతో ఒక పుస్త‌కాన్ని ప్రచురిస్తాడు. ఒక్క కాపీ కూడా చెల్లదు. ప్రాంతీయ గ్రంధాలయంలో లైబ్రేరియన్ గా పని చేసే పద్మ భూషణ్ తన పుస్తకాన్ని దొంగచాటుగా మిగతా పుస్తకాలతో కలిపి ఎలాగైనా పుస్తకాన్ని చదివించాలని తాపత్రయపడుతుటాడు. పుస్తకానికి మంచి పేరు వచ్చిన తర్వాత తను రచయితనని తల్లితండ్రులతో పాటు ప్రపంచానికి చెప్పాలని భూషణ్ ఆలోచన. అయితే సరిగ్గా ఇదే సమయంలో రైటర్ పద్మభూషణ్ పేరుతో గుర్తు తెలియని మరో రచయిత పుస్తకాన్ని ప్రచురిస్తారు. ఆ పుస్తకానికి మంచి గుర్తింపు వస్తుంది. దాన్ని భూషణే రాశాడని భావించి తన కూతురు సారిక (టీనా శిల్ప రాజ్ ) ను భూషణ్ కి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించేస్తాడు భూషణ్ మేనమామ లోకేంద్ర (గోపరాజు రమణ). తర్వాత ఏం జరిగింది ? భూషణ్ పేరుతో పుస్తకం రాసింది ఎవరు ? భూషణ్ పాపులర్ రైటర్ కాదనే సంగతి మేనమామకి తెలిసిందా ? భూషణ్ పెళ్లి సారికతో జరిగిందా ? ఇవన్నీ తెరపై చూడాలి.

సుహాస్ సినిమా అంటే అద్భుతాలు ఏమీ ఆశించరు ప్రేక్షకులు. చుసున్నంత సేపు కాలక్షేపం అయిపోతే చాలు. కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఈ పాయింట్ పైనే దృష్టిలో పెట్టుకొని ఈ కథని అల్లుకున్నాడు. సుహాస్ పరిచయం, తన పుస్తకం పది మందితో చదివించాలానే అతని తాపత్రయం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టయిల్.. ఇవన్నీ సరదాగా ప్రజంట్ చేసుకుంటూ వెళ్లారు. సారిక పాత్ర ఎంట్రీతో కథలో ఒక మలుపు వస్తుంది. అప్పటివరకూ తన పుస్త‌కాన్ని చదించాలనే తాపత్రయ పడే భూషణ్ .. వేరే రచయిత క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం, ఆ క్రమంలో కాస్త గిల్టీగా ఫీలవ్వడం.. రెగ్యులర్ గానే అనిపిస్తుంది. అయితే దర్శకుడు రాసుకున్న లవ్ ట్రాక్.. సుహాస్ ఫన్ టైమింగ్ పండటంతో ఆ సీన్లు కూడా టైం పాస్ అయిపోతాయి. థియేట‌ర్లో సీన్‌.. యువ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. అక్క‌డే… ప‌ద్మ‌భూష‌ణ్ పాత్ర‌లోని అమాయ‌క‌త్వాన్ని, అతి మంచి త‌నాన్ని క్యాప్చ‌ర్ చేయ‌గ‌లిగాడు డైరెక్ట‌ర్‌.

భూషణ్ పేరుతో రాసే మరో రైటర్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్లాక్ లో పరిచయం అయ్యే కొత్త పాత్ర సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో వున్న ఫన్ సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యింది. కన్నా పాత్ర తెరపైకి రావడం, ఆ పాత్రని దర్శకుడు మలిచిన విధానం అంత సహజంగా వుండదు. ఆ పాత్రకి కథలో ఒక లింక్ కుదిర్చినప్పటికీ అది అంత వర్క్ అవుట్ కాలేదు. అయితే అసలు పద్మ భూషణ్ ఎవరనే ఆసక్తి మాత్రం చివరి వరకూ కొనసాగుతుంది. దర్శకుడు క్లైమాక్స్ ని రాసుకున్న విధానం కూడా బావుంది. నిజానికి అతను చెప్పాల్సిన ప్రధాన అంశం కూడ అదే. ఈ పాయింట్ ని బలంగా నమ్మే ఈ కథ ఓకే అయ్యింటుంది. ఆ పాయింట్ కి ఇచ్చిన ట్రీట్ మెంట్ ఎలా ఉన్నప్పటికీ.. చివర్లో బరువైన మాటలతో సందేశం అనిపించినప్పటికీ.. ‘నిజమే కదా’ అనే భావన కలిగించడంలో రైటర్ టీంకు మార్కులు పడ్డాయి.

వెండి తెర‌పై ఇన్ని పుస్త‌కాల్ని చూసి ఎంత కాల‌మైందో..? బాపు ఆ రోజుల్లో.. ప్ర‌తీ ఫ్రేములోనూ అవ‌స‌రం ఉన్నా, లేకున్నా.. పుస్త‌కం క‌నిపించేలా పెట్టేవార్ట‌. ఎందుకండీ.. అని అడిగితే `క‌నీసం ఇలాగైనా మ‌న‌పుస్త‌కాలు గుర్తొస్తాయ‌ని ఆశ‌` అని చెప్పేవార్ట‌. నిజం… రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్ చూస్తే… ర‌చ‌యిత‌ల మ‌న‌సు నిండిపోతుంది. ర‌చ‌యిత‌లు కావాల‌ని ఆశ‌ప‌డేవాళ్ల‌కు.. ఓ ఉత్సాహం వ‌స్తుంది. అయితే.. వాస్తవంలో ర‌చ‌యిత‌ల ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో.. ప‌ద్మ‌భూష‌ణ్ పాత్ర‌తో చెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్ప‌ట్లో పుస్త‌కం అచ్చు వేయించుకోవ‌డం సుల‌భ‌మే కానీ, కాపీని అమ్మ‌డం అంత తేలిక కాదు. రాసిన పుస్త‌కం ఎవ‌డూ చ‌ద‌వ‌క‌పోతే.. క‌నీసం ప‌ట్టించుకోక‌పోతే.. ఆ ర‌చ‌యిత ప‌డే బాధ అంతా ఇంతా కాదు. అదంతా వినోదాత్మ‌కంగానైనా.. తెర‌పైకి తీసుకొచ్చి, ర‌చ‌యిత క‌ష్టాన్నీ, బాధ‌నీ ఆవిష్క‌రింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని సింబాలిక్ షాట్లు భ‌లే ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు… ప‌ద్మ‌భూష‌ణ్ పుస్త‌కాన్ని ఎవ‌రైనా ఆస‌క్తిగా చ‌దువుతున్న‌ప్పుడు… ప‌ద్మ‌భూష‌ణ్ కాలిపై కాలు వేసుకొంటాడు. ఆ షాట్‌… ర‌చ‌యిత‌ల తాలుకూ గ‌ర్వం చూపిస్తుంది. `నువ్వే కాపాడాలి..` అని ప‌ద్మ‌భూష‌ణ్ దేవుడికి దండం పెట్టుకొంటున్న‌ప్పుడు… ఆ అద్దాల్లోంచి అమ్మ ఫ్రేమ్‌లోకి వ‌స్తుంది. ఇలా… ద‌ర్శ‌కుడు అక్క‌డ‌క్క‌డ త‌న ప్ర‌తిభా పాట‌వాలు చూపించుకొంటూ వెళ్లాడు.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌న‌స్త‌త్వాల్ని కూడా ద‌ర్శ‌కుడు బాగా ప‌ట్టాడు. ఎనిమిది వేలు మిగిలిపోతే… ఓ మిడిల్ క్లాస్ తండ్రి సంబ‌ర‌ప‌డే విధానం… హైలెట్‌. అంతేనా? చుట్టాల పెళ్లికి అద్దె కారులో వెళ్లి.. `మేం కార్లో వ‌చ్చాం..` అని అంద‌రికీ తెలిసేలా ప్ర‌వ‌ర్తించడం అచ్చంగా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఈ సీన్ల‌న్నీ ద‌ర్శ‌కుడు బాగా రాసుకొన్నాడు. ఈ సినిమాలో లోపాలు లేవా..? అంటే ఉన్నాయి. ద‌ర్శ‌కుడు లాజిక్కులు వ‌దిలేశాడు. సీన్లు… త‌న‌కు కావ‌ల్సిన‌ట్టు రాసుకొన్నాడు. క్లైమాక్సులో స్పీచులు వ‌ర‌ద‌లై పార‌తాయి. కాక‌పోతే.. అవ‌న్నీ క్ష‌మించేయొచ్చు. సినిమా ఆసాంతం ఓ చిన్న చిరున‌వ్వు.. పెదాల‌పై పాకుతూ ఉంటుంది. అది.. కొన్ని లోపాల్ని క‌ప్పిపుచ్చేస్తుంటుంది.

సుహాస్ నటన రైటర్ పద్మభూషణ్ కు ప్రధాన ఆకర్షణ. అప్ కమింగ్ రైటర్ గా జీవించేశాడు. చాలా చిన్న డిటేయిల్ కూడా అతని సుహాస్ లో చక్కగా పలికింది. తన కామెడీ టైమింగ్ బావుంది. చివర్లో ఎమోషనల్ సీన్స్ లో కూడా పరిణితి చూపించాడు. సారిక పాత్రలో టీనా శిల్పా రాజ్ పర్వాలేదనిపిచింది. సుహాస్, టీనా కెమిస్ట్రీ గొప్పగా లేనప్పటికీ థియేటర్ లో సీన్, ఇంకొన్ని సరదా మాటలు అలరించాయి. కన్నా పాత్రలో చేసిన గౌరీ స్క్రీన్ ప్రజన్స్ బావుంది. ఆశిష్ విద్యార్ధి పాత్ర అలరిస్తుంది. ఈ త‌ర‌హా పాత్ర ఆయ‌న‌కు ఇంత వ‌ర‌కూ ప‌డ‌లేదు. ఇక నుంచి ఆశీష్ ని ద‌ర్శ‌కులు చూసే దృష్టి మారుతుంది. రోహిణి కథలో చాలా కీలకం. సరస్వతి పాత్రకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. గోపరాజు రమణతో పాటు మిగతా నటీనటులు పరిధిమేర చేశారు.

నిర్మాణంలో బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ డీసెంట్ గా వుంది. కన్నుల్లో నీ రూపమే పాట క్యాచిగా వుంది. వెంకట్ కెమరాపని తనం బావుంది. కొన్ని మాటలు బావున్నాయి. `మ‌నిషి మంచోడేరా గుణ‌మే గోరింటాకు` అన‌డంలో అర్థం ఉందో లేదో తెలీదు కానీ… విన‌డానికి బాగుంది. ముఖ్యంగా ముగింపులో వినిపించిన మాటలు ఆలోచింపజేస్తాయి. కథ పరంగా ఒక మంచి పాయింట్ ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ పాయింట్ చెప్పడానికి అల్లుకున్న కథనం మరింత వినోదాత్మకంగా మలిచి వుంటే రైటర్ భూషణ్ మరింతగా నచ్చేసేవాడు.

ఈ సినిమాలో అక్క‌డ‌క్క‌డ కార‌ణం ఏం లేక‌పోయినా ప‌ద్మ‌భూష‌ణ్ న‌వ్వుతుంటాడు. ఎందుకురా అలా న‌వ్వుతున్నావ్‌..? అని అడిగితే. `ఏంటో.. అలా వ‌చ్చేస్తోంది` అని న‌వ్వుతూనే స‌మాధానం చెబుతాడు. అలా.. ఈ సినిమాలో కూడా పెద్ద కార‌ణాలేం క‌నిపించ‌క‌పోయినా ప్రేక్ష‌కుడి పెదాల‌పై న‌వ్వు.. క‌రెంట్ లా పాస్ అవుతూనే ఉంటుంది. ఆ న‌వ్వే ఈ సినిమాకి శ్రీ‌రామ ర‌క్ష‌.

తెలుగు360 రేటింగ్ :2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close