కోల్‌కతాలో సోనాగచి అనే ప్రాంతం ఉంటుంది. అది పూర్తిగా మహిళల పడుపు వృత్తి చేసుకునేవారికి ప్రత్యేకమైనది. కొన్ని లక్షల కుటుంబాలు అక్కడ ఆ వృత్తిలో ఉంటాయి. అక్కడ ఒక్కచోటే ఉంటారని కాదు.. ఇంకా ఉంటారు. ముంబైలో కామాటిపురా గురించి తెలియని వాళ్లు ఉంటారు. ఢిల్లీలో జీబీ రోడ్డు అంతా అలాగే ఉంటుంది. మరి అలాంటి ప్రసిద్ధి చెందిన ఏరియాలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా?. వ్యవస్థీకృతంగా ఫలానా చోట్ల వ్యభిచారం జరుగుతుందని ఎవరైనా చెప్పగలరా ? హైదరాబాద్ లో ఫలానా ప్రాంతం వ్యభిచారానికి నడ్డా అని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే చాలా మెట్రో సిటీల్లో అలాంటి ఏరియాలు ఉన్నా హైదరాబాద్‌లో మాత్రం లేదు. అలాగే ఏపీలోని ఇతర పట్టణాల్లోనూ లేవు. మరి ఇక్కడ సెక్స్ వర్కర్లు అత్యధికం అని ఎలా తేల్చారు?. వైరల్ చేసిన రిపోర్టుకు ప్రామాణికత ఏమిటి?
సెక్స్ వర్కర్లను ఎలా గుర్తిస్తారు ?
2025 టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 2వ తేదీన ప్రచురితమైన కథనం, ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అధ్యయనం ఆధారంగా, దేశంలో మొత్తం 9,95,499 మంది మహిళా సెక్స్ వర్కర్లలో కర్ణాటక 15.4 శాతం, ఆంధ్రప్రదేశ్ 12 శాతం, మహారాష్ట్ర 9.6 శాతం , ఢిల్లీ 8.9 శాతం, తెలంగాణ 7.6 శాతం ఉన్నాయని పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాలు దేశంలోని 53 శాతం సెక్స్ వర్కర్లను కలిగి ఉన్నాయని చెప్పింది. తెలంగాణలో హాట్‌స్పాట్‌కు 38 మంది , ఆంధ్రప్రదేశ్‌లో 29 మంది ఉన్నారని, ఇవి దేశంలో అత్యధిక సాంద్రత కలిగిన ప్రాంతాలని చెప్పుకొచ్చింది. ఈ నివేదికకు ఆధారం కేవలం గుర్తించిన సెక్స్ వర్కర్ల గురించే. వీరిని ఎలా గుర్తిస్తారో ఎవరికి తెలియదు.
దక్షిణాది మహిళలపై తప్పుడు ముద్ర వేసే కుట్ర
సెక్స్ వర్క్ చట్టవిరుద్ధం కాబట్టి ఖచ్చితమైన గణాంకాలు సేకరించడం సాధ్యం కాదు. గుర్తించిన సెక్స్ వర్కర్ల గణాంకాల ఆధారంగానే ఈ రిపోర్టు తయారు చేశారు. కోల్ కతాలో.. ముంబైలో.. ఢిల్లీలో కనిపించినంత, గుర్తించినంత కన్నా ఎక్కువ మంది సెక్స్ వర్కర్లను దక్షిణాదిలో .. తెలుగు రాష్ట్రాల్లో గుర్తించారా ?. ఈ రిపోర్టు తయారు చేసిన నేపధ్యం.. దాన్ని అడ్డం పెట్టుకుని కొంత మంది చేస్తున్న తప్పుడు ప్రచారాలు, ఓ ప్రాంతంపై వేశ్యావాటికల ముద్ర వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తూంటే.. కుట్ర ఏమిటో అర్థమైపోతుంది.
సామాజిక సమస్యను ప్రాంతాలపై రుద్దుతారా ?
వేశ్యా వృత్తి అనేది పురాతన కాలంలోనూఉంది. అన్ని చోట్లా ఉంది. ప్రభుత్వాలు దాన్ని నిషిద్ధం చేసినా ఆపలేకపోయాయి. అన్ని చోట్లా కొనసాగుతున్నాయి. సెక్స్ వర్కర్ అంటే నేరం చేసినట్లే. ఇంత మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా గుర్తిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియదు. కేసులు.. చట్టాలతో ఆ సమస్యను నిర్మూలించలేమని తెలుసు. అయినా తప్పుడు గణాంకాలతో విశ్లేషణలు చేసి.. ప్రాంతాలపై, ఆయా ప్రాంతాల మహిళలపై తప్పుడు ముద్ర వేసేందుకు కొంత మంది రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇలాంటివి హీనమైన నేరాలతో సమానం.