ప్రముఖ నటుడు శివాజీ తన సినిమాలను పక్కనబెట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. అందుకు ఆయనను మెచ్చుకోవలసిందే. కానీ ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన మునికోటి మరణంపై ఆయన స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా తప్పని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ దాని కోసం అవసరమయితే తనే స్వయంగా ఒక ‘పెద్ద నేత’ (?) మీద ఆత్మాహుతి దాడి చేస్తానని శివాజీ చెప్పడం యువతకి తప్పుడు సందేశం ఇస్తునట్లుంది. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడమే ఒక పొరపాటు అనుకొంటుంటే మళ్ళీ ఆయన ఆత్మాహుతి దాడుల గురించి మాట్లాడటం ఇంకా పెద్ద పొరపాటు. ఉద్యమానికి నాయకత్వం వహించే వారెవరయినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. లేకుంటే దాని పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. తెలంగాణా ఉద్యమం సమయంలో కొందరు నాయకులు మాట్లాడిన మాటలు, పరిణామాల కారణంగానే అనేకమంది యువకులు బలిదానాలు చేసుకొన్న సంగతి అందరికీ తెలుసు. కనుక శివాజీతో సహా ఈ ఉద్యమం చేస్తున్నవారు అది అదుపు తప్పకుండా తన లక్ష్యాన్ని మాత్రమే సాధించేలా ముందుకు నడపాలి తప్ప ఆత్మహత్యలు, ఆత్మాహుతి దాడుల గురించి మాట్లాడటం చాలా ప్రమాదకరం.