కొన్ని రోజుల క్రితమే తెదేపా ఎంపీ రాయపాటి సాంభశివరావు మీడియాతో మాట్లాడుతూ “ప్రత్యేక హోదా కోసం మేము ఎంత పోరాడాలో అంతా పోరాడేశాము…ఇక పోరాడటానికి మిగిలిందేమీ లేదు…కేంద్రప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదు…అదివ్వనంటుంటే ఇక మేమీ చేయగలం…గుడ్డలు ఊడదీసుకొని తిరగమంటారా?” అని మీడియాతో అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, ఆ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా ఎప్పుడో తెలుసని కుండ బ్రద్దలుకొట్టినట్లు చెప్పారు. ఆ తరువాత కేంద్రమంత్రి సుజానా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యేక ప్యాకేజయినా సాధిస్తామని చెప్పారు. అంటే ఇక ప్రత్యేక హోదా రాదని తెదేపా నేతలందరూ తేల్చిచెప్పినట్లయింది.
కానీ అదే తెదేపా ఎంపీలు మళ్ళీ ఈరోజు లోక్ సభలో ప్రత్యేక హోదాపై చర్చించేందుకు అనుమతించాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ కి నోటీసు ఇచ్చారు. అది ఎందుకో అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా కోసం మునికోటి అనే వ్యక్తి తిరుపతిలో ఆత్మహత్య చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీ నేడు తిరుపతి బంద్ కి పిలుపునీయడం, మరో పక్క వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా కోసం ఇవాళ్ళ దీక్షకు కూర్చోవడం, రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన సమితి సమావేశాలు, ర్యాలీలు, వామపక్షాల బస్సు యాత్రలు, ప్రత్యేక హోదా కోసం ఈనెల 11న రాష్ట్ర బంద్ కి పిలుపునీయడం వంటి పరిణామాల కారణంగానే తెదేపాపై ఒత్తిడి పెరగడంతో తెదేపా ఎంపీలు నేడు నోటీసులు ఇచ్చారని అర్ధమవుతోంది.
ఒకసారి ప్రత్యేక హోదా రాదని, మరొకసారి బీహార్ ఎన్నికల తరువాత వస్తుందని ఇంకోసారి హోదా అవసరం లేదు ప్యాకేజి తీసుకొంటే సరిపోతుందని రకరకాల మాటలు చెపుతున్న తెదేపా ఇప్పుడు దీని కోసం స్పీకర్ కి నోటీసు ఇచ్చినంత మాత్రాన్న గట్టిగా పోరాడుతుందనే నమ్మకం ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ పోరు పడలేకనే తాము పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద ధర్నాలు చేసాము తప్ప దాని వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదని జేసీ దివాకర్ రెడ్డి స్వయంగా చెప్పుకొన్నారు.కనుక ఇప్పుడు తెదేపా చేసే పోరాటాలని విశ్వసించడం కష్టం. రాజధాని నిర్మాణం వగైరా అనేక కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వం సహకారం తప్పనిసరి కనుక ఏదో ఈ అందరి పోరు పడలేకనే మళ్ళీ పోరాటం చేస్తున్నట్లు నటిస్తోందే తప్ప నిజంగా కాదనే చెప్పవచ్చును. తెలంగాణా ఎంపీలు హైకోర్టు విభజన వగైరా అంశాల కోసం పోరాడుతున్న తీరుకి, తెదేపా ఎంపీలు ప్రత్యేక హోదా పోరాడుతున్న తీరుకి మధ్య గల తేడాని గమనించినట్లయితే ఆసంగతి అర్ధమవుతుంది. తెదేపా తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని ప్రత్యేక హోదా అంశాన్ని నిర్లక్ష్యం వహిస్తే ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని దాని ప్రయోజనం పొందుతాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే అందుకు చక్కటి ఉదాహరణగా నిలుస్తున్నాయి.