తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాసిన ఓ లేఖ పై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా వర్గాలు ఆయన చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆ లేఖ రాశారని అంటున్నారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే కాకినాడ సెజ్, ఇతర పరిశ్రమల పేర్లతో పెద్ద ఎత్తున అగ్రకులాలకు చెందిన వాళ్లు బీసీల భూముల లాక్కున్నారని వారు పెద్దవాళ్లయ్యారు కానీ బీసీలు ఇంకా ఎదగలేదని వారి భూములు వారికి ఇప్పించండి అని. ఈ లేఖలో ఆయన కొంత మంది కులాల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా వ్యాపారవేత్తల పేర్లలో కులాల తోకల్ని జత చేశారు. దీంతో సహజంగానే యనమల రామకృష్ణుడు కుట్రపూరితంగా .. బ్లాక్ మెయిల్ కోసం ఈ లేఖ రాశారన్న అనుమానాలకు బీజం పడింది.
యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ తో పాటు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రిగా ఉన్నారు. ఈ సారి మాత్రం ఆయనకు అవకాశం దక్కలేదు. అంటే.. ఉమ్మడి తూ.గో జిల్లాలో ఆయన మాట కాదనుకుండా పనులు జరిగాయి. ప్రతి పనిలోనూ ఆయన ముద్ర ఉంటుంది. అంత పవర్ ఫుల్ రోల్ ఆయన పోషించారు. మరి ఆ కాకినాడ సెజ్ వస్తున్నప్పడు కానీ.. ఆ తర్వాత కానీ.. పరిశ్రమలు వస్తున్నప్పుడు కానీ ఫార్మా పరిశ్రమలకు వ్యతిరేకంగా భూపోరాటాలు జరిగినప్పుడు కానీ యనమల ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు.. ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఇక్కడ చాలా మందికి వచ్చేడౌట్. దాన్నే ప్రశ్నిస్తున్నారు.
యనమల రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవి ఆశించి ఇలా రాజకీయం చేస్తున్నారని.. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎక్కువ మంది అనుకుంటుంటున్నారు. యనమల కుటుంబం పొందిన రాజకీయ ప్రయోజనాలు ఎవరూ పొందలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. యనమల కూతురు ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ, వియ్యంకుడు ఎమ్మెల్యే, ఆయన స్వయంగా ఎమ్మెల్సీ. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని ఓడించడానికి ఆయన బంధువు తలసాని ఏపీపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సైలెంటుగా గా ఉన్నారు యనమల. అప్పుడు కూడా టీడీపీ నేతలు ఆయన సిన్సియార్టీని సందేహించలేదు. కానీ ఒక్క లేఖతో ఆయన పరపతి అంతా క్యాడర్ లో పోగొట్టుకున్నట్లయింది.