యార్లగడ్డ లక్ష్మిప్రసాద్. రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికి ఈయన క్యారెక్టర్ గురించి బాగా తెలుసు. క్యారెక్టర్ తో పని లేకుండా పదవిని అందుకోవడమే ఆయన స్టైల్. తాజాగా ఆయనకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హిందీ సలహా సంఘం సభ్యుడి పదవి లభించింది. పది మంది సలహాదారులలో ఆయన ఒకడు. ఇదేం పెద్ద పదవి కాదు…కానీ యార్లగడ్డ లాంటి వారికి పెద్ద పదవే.
2014-19 మధ్య కాలంలో టీడీపీ హయాంలో ఏ పదవీ రాలేదని ఆయన జగన్ పంచన చేరారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కోసం ఆయన చేసిన రచ్చ… చంద్రబాబు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియా పెడితే మాతృభాషను చంపేస్తున్నారని చొక్కా విప్పదీసి చేసిన నాటకాలు అందరికీ గుర్తుంటాయి. గెలిచిన తర్వాత ఆయనకు జగన్ రెడ్డి ఒకటి, రెండు పదవులు ఇచ్చారు. దాంతో జగన్ భజన బాగానేచేశారు.
తర్వాత జగన్ రెడ్డి పరిస్థితి దిగజారిందని తెలుసుకుని హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినప్పుడు తన కు ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు కానీ… జగన్ రెడ్డిని మాత్రం పొగడటం ఆపలేదు. ఎన్నికల ముంగిటకు వచ్చేసరికి సీన్ మార్చేశారు. కూటమికి ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఆయన ప్రచారం చేశారో లేదో ఎవరికీ తెలియదు. ఆయన ప్రచారం వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఆ తర్వాత జగన్ ఓడిపోయారు కాబట్టి సహజంగానే ఆయనకు మద్దతుగా మాట్లాడటం మానేశారు. కూటమిలో ఏ పార్టీ నేతను పట్టుకున్నారో కానీ.. ఓ సలహాదారు పదవి పొందేశారు.