ఇటీవల విడుదలైన ‘టాక్సిక్’ టీజర్ చుట్టూ వివాదం చెలరేగింది. టీజర్ లోని అశ్లీల సన్నివేశాలపై తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, కమిషన్ సెన్సార్ బోర్డుకు లేఖ రాయడం మరింత హాట్ టాపిక్ మారింది. టీజర్లో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నాయనేది ప్రధాన ఫిర్యాదు. దీంతో సినిమా ప్రమోషన్ పేరుతో టీజర్లలో చూపిస్తున్న కంటెంట్‌పై నియంత్రణ అవసరమా అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.
టీజర్ అనేది ప్రేక్షకుడికి సినిమాపై తొలి అభిప్రాయాన్ని కలిగించే శక్తివంతమైన సాధనం. కాకపోతే ఈ రోజుల్లో చాలా సినిమాలు టీజర్లను పబ్లిసిటీ గిమ్మిక్లుగా వాడుకుంటున్నాయి. షాక్ వాల్యూ, ఇంటిమేట్ సన్నివేశాలు, బోల్డ్ విజువల్స్ ఎక్కువగా కట్ చేసి వైరల్ చేయడం ఇప్పుడు సాధారణమైపోయింది. టాక్సిక్ లో కూడా ఈ ట్రెండ్ కనిపించింది.
అయితే టీజర్లో కనిపించేది సినిమాలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సన్నివేశాలు కేవలం హైప్ కోసం మాత్రమే తీసి, తర్వాత సినిమాలో తొలగించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.కాకపోతే అప్పటికే టీజర్ జనాల్లోకి వెళ్ళిపోవడంతో కొందరిపై ప్రభావం పడే అవకాశం వుంది.
అయితే ఈ డిజిటల్ యుగంలో టీజర్ నియంత్రణ అవసరమా? చర్చ కూడా వుంది. ఒకప్పుడు టీజర్లు థియేటర్లలో, టీవీలలో మాత్రమే ప్రదర్శించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ట్విట్టర్ (X) అన్నిచోట్ల ఏ వయస్సు పరిమితి లేకుండా టీజర్లు అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు, టీనేజర్లు కూడా అవే విజువల్స్‌ను నిర్బంధం లేకుండా చూస్తున్నారు.
టీజర్ ట్రైలర్ సినిమా ప్రచారానికి కీలకం. టీజర్లకు కూడా పూర్తి స్థాయి సెన్సార్ కల్పించడం సాధ్యమౌతుందా ? అనే ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పడం కష్టమే. కాకపొతే మరీ హింస రక్తపాతం అశ్లీలం వున్న ప్రచార సామగ్రికి ఒక మోడరేషన్ వ్యవస్థ వుండటం మంచిదే.
