‘కేజీఎఫ్’ తరవాత యశ్ నుంచి వస్తున్న సినిమా `’టాక్సిక్’. గ్లింప్స్, టీజర్.. ఓ రేంజ్లో ఉండేసరికి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రూ.120 కోట్లకు కొనుగోలు చేశారు. దాంతో మరింత హైప్ పెరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా ‘టాక్సిక్’, ‘దురంధర్ 2’ ఒకే రోజు విడుదల తేదీ ఫిక్స్ చేసుకొన్నాయి. దాంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ చూడొచ్చనుకొన్నారంతా. అయితే ఇప్పుడు ‘టాక్సిక్’ అనూహ్యంగా వాయిదా పడింది. గల్ఫ్ వార్ నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తున్నామని, జూన్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. దాంతో యశ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
గల్ఫ్ యుద్ధం నిజంగానే అంత కంగారు పెడుతోందా? లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే దిశగా డిబేట్ మొదలైంది. గల్ప్ యుద్ధం అంతగా ప్రభావితం చేస్తుందనుకొంటే ‘దురంధర్ 2’ కూడా వాయిదా పడాలి. ఎందుకంటే.. ‘టాక్సిక్’ కంటే ‘దురంధర్ 2’పై గల్ఫ్ వార్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ‘దురంధర్ 2’ వచ్చేస్తుంది. ‘టాక్సిక్’కి మాత్రమే బ్రేకులు పడ్డాయి.
‘టాక్సిక్’కి కావల్సినంత బజ్ లేదని, దాంతో పాటు ‘దురంధర్ 2’తో పోటీ పడడం నిర్మాతలకు ఇష్టం లేదని, సోలో రిలీజ్ అయితే వసూళ్లు మరింతగా బాగుంటుందన్న ఆలోచనతోనే ఈ సినిమాని వాయిదా వేశారన్న ప్రచారం మొదలైంది. ‘టాక్సిక్’కి సంబంధించి ఇది వరకు కొంత మేర రీ షూట్ జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వాటిలో నిజానిజాలేంటన్నది చిత్రబృందానికే తెలియాలి. `టాక్సిక్` వాయిదా పడడడంతో ‘దురంధర్ 2’కి మరింత బలం వచ్చినట్టైంది. ఈసారి దురంధర్ జోరు మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
