“అన్నా మన కార్యకర్తలకు ఏమైనా చేద్దాం.. కనీసం బీమా ఇద్దామన్నా “ అని ముఖ్యనేతల సమావేశంలో జగన్ రెడ్డిని ఓ నేత వేదికపై నుంచే విజ్ఞప్తి చేశాడు. “భలేవాడివే.. నువ్ చాలా చిన్న కోరిక అడిగావు.. ఇంకా ఏదైనా పెద్దగా చేద్దామనుకుంటున్నా..” అని జగన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఎప్పుడు కార్యకర్తల సంక్షేమం గురించి టాపిక్ వచ్చినా ఇలాగే మాట్లాడతారు. కానీ ఏమీ చేయరు. రాజకీయం కోసం బెట్టింగ్‌కు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఏడాది తర్వాత పరామర్శిస్తారు కానీ తన కారు కింద పడిన కార్యకర్త ప్రాణాలు పోయినా లైట్ తీసుకుంటారు. జగన్ రెడ్డి మనస్థత్వం కార్యకర్తలు ఎవరూ పార్టీ కోసం పని చేయడం లేదు. వారి కోసం వారు పని చేసుకుంటున్నారు. అంతే.
కార్యకర్తల్ని పెట్టుబడిగా పెడుతున్న జగన్
జగన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తల్ని రాజకీయంగా పెట్టుబడి పెడుతున్నారు. ఆ కార్యకర్తల కష్టంతో వచ్చే బలాన్ని పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. కానీ వారికేమీ చేయడం లేదు. ఇటీవల ఆ పార్టీ తరపున ఓ ప్రకటన వచ్చింది. యువ నేతలకు ఆహ్వానం.. వారిని ఎమ్మెల్యేలను చేస్తాం.. దాని కోసం ఏం చేయాలో ఓ పోస్టర్ వేశారు. జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా లేకపోతే పార్టీ కార్యక్రమాలకు అయినా సరే రెండు వేల మందిని సమీకరించగలిగే నేతలకు ప్రాధాన్యం ఇస్తామని అందులో ఉంది. జగన్ రెడ్డి మైండ్ సెట్ ఎంత ఫ్యూడలిజంతో నిండిపోయి ఉంటుందో ఇలాంటి కోరికలే నిరూపిస్తాయి. వారు జనం తీసుకొస్తే.. జగన్ తన ఖాతాలో వేసుకుంటారన్నమాట.
వారి బాధలు వారు రాసుకోవడం ఏంటి?
తాజాగా వేధింపులకు గురవుతున్నారు.. వచ్చాక ప్రతీకారం తీర్చుకుందాం అని.. డిజిటల్ బుక్ ప్రారంభించారు. ఇది మరీ విచిత్రమైన ఆలోచన. కనీసం బాధితుడైన పార్టీ కార్యకర్త బాధను వినేందుకు పార్టీలో ఓ వ్యవస్థ లేదు. బాధల్ని తప్పించేందుకు సాయం చేయాలి .. వేధింపుల్ని ఎదుర్కొనేందుకు పార్టీ వ్యవస్థను సిద్ధం చేయాలి కానీ.. ఇలా మీ బాధలు బుక్కులో రాసుకోండి మనం వచ్చాక.. చించేద్దాం అని అనడం ఏమిటి?. అది కూడా తన బాధను తానే నమోదు చేసుకోవాలి. గతంలో వైఎస్ఆర్ కుటుంబం అని ఓ ఫోన్ కాల్ ఉద్యమం చేశారు. అధికారంలోకి వచ్చాక అందులో నమోదు చేసుకున్న అందరికీ మేలు చేస్తామన్నారు. మర్చిపోయారు. ఇప్పుడు డిజిటల్ బుక్ నాటకం. అంతా క్యాడర్ ను మోసం చేసి.. వారిని రోడ్లపైకి తీసుకు రావడానికి.
వారి సంక్షేమం కోసం ఎం చేస్తారు ? ఎప్పుడు చేస్తారు ?
కార్యకర్తలకు బీమా అనేది అన్ని పార్టీలు ఇస్తున్న ఓ సౌకర్యం. వైసీపీలో అది కూడా లేదు. వైసీపీ కోసం పని చేసే వారికి సరైన సంక్షేమం లేదు. సోషల్ మీడియా కార్యకర్తల్ని విపరీతంగా వాడుకుని వారి జీవితాలను పణంగా పెడుతున్నారు కానీ వారి సంక్షేమం కోసం చిన్న ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ కార్యకర్తలంతా వారి రాజకీయ ప్రయోజనాలు, దందాలు చేసుకోవడానికి పార్టీకి పని చేస్తున్నారు కానీ.. మా కోసం కాదని జగన్ రెడ్డి అనుకుంటారు. అందుకే వారికి ఏమీ చేయాల్సిన పని లేదని అనుకుంటారు. వైసీపీ కార్యకర్తలు రియలైజ్ అవుతున్నారు కాబట్టే.. అసలు ఆ పార్టీ కోలుకోవడం లేదు. ఇక ముందూ అదే పరిస్థితి.