జగన్ రెడ్డి పొగుడుతాడని అందర్నీ ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసే నేతలు, జగన్ రెడ్డికి లేనిపోని క్రెడిట్లు ఇచ్చేందుకు ఆరాటపడేవారికి వైసీపీ రిటైర్డ్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మంచి సలహా ఇచ్చారు. జగన్ రెడ్డి పొగడ్తల కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఆయనకు నష్టం చేయడమేనని.. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా.. అవాస్తవాలు,లేనిపోని గొప్పలు ఆపాదించడం వల్ల ప్రయోజనం ఉండదని తేల్చేశారు. జగన్ కు మేలు జరగాలంటే.. ఇవన్నీ మానేయాలని సలహా ఇచ్చారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి సలహాలు .. పెద్దల మాట చద్దిమూటగా తీసుకునేంత మానసిక పరిణితిని వైసీపీ నేతలు, వైసీపీ మీడియా.. సోషల్ మీడియాలు ఇంకా సాధించలేదు. ఎన్ని బూతులు వాడితే జగన్ రెడ్డి అంత సంతోషిస్తారు. ఎంతగా ఆయనకు క్రెడిట్ ఇచ్చి పొగిడితే ఆయన అంతగా గుర్తిస్తారు. అందుకే పార్టీ నేతుల పోటీ పడుతూ ఉంటారు. కానీ దీని వల్ల జగన్ రెడ్డి జనాల్లో పలుచన అవుతున్నారని.. ఆయనకు మంచి జరగదని మేకపాటి ఆలోచన.
మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా ప్రస్తుత వైసీపీ వ్యవహారాలు, పార్టీ నేతల తీరుపై చిరాకేసినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆయన జగన్ రెడ్డి మంచినే కోరుకుంటున్నారు. అందుకే రాజకీయాల్ని రాజకీయాలుగా చేయాలని సలహా ఇస్తున్నారు. కానీ ఇలాంటి సలహాలు జగన్ రెడ్డికే నచ్చవు. మేకపాటి టీడీపీకి అమ్ముడుపోయారని అనుకుంటారు. ఇలాంటి సలహాలు వైసీపీకి ఇవ్వడం అంటే.. పార్టీకి దూరం కావడమే. పెద్దాయనగా గౌరవిస్తారని మేకపాటి ఆశపడ్డారేమో కానీ..ఇలాంటి సలహాల వల్ల ఆయనను పార్టీలో మరింత దూరం పెడతారు.
