వైసీపీ ఎమ్మెల్సీలకు నాయకుడు అయిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూండటంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల్లో జగన్కు దగ్గర అనుకున్న వాళ్లు తోటి ఎమ్మెల్సీలపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వారి మధ్య వివాదాలకు కారణం అవుతోంది. తాజాగా శాసనమండలిలో ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, వరుదు కల్యాణి వాగ్వాదానికి దిగారు. అనవసరంగా వరుదు కల్యాణిపై అప్పిరెడ్డి పెత్తనం చూపించే ప్రయత్నం చేయడంతో వివాదం ఏర్పడింది.
వరదు కల్యాణి పేరు మీద వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభమయ్యే సమయానికి వరుదు కల్యాణి సభలో లేరు. అందుకే వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లుగా మండలి చైర్మన్ ప్రకటించారు. దీంతో వాయిదా తీర్మానం ఇచ్చి సభకు సమయానికి ఎందుకు రాలేదని అప్పిరెడ్డి పెద్దరికం తీసుకుని వరుదు కల్యాణిని మందలించినట్లుగా అడిగారు. దాంతో ఆమె అదే స్థాయిలో సమాధానం చెప్పింది. తనకు తెలియకుండా తన పేరుతో వాయిదా తీర్మానం ఇచ్చారని.. ఇచ్చిన తర్వాత అయినా తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించడంతో అప్పిరెడ్డికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.
బొత్స సత్యనారాయణ.. ఇక శాసనమండలి పక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించడం కష్టం కావడం.. ఒత్తిడి తీసుకునేందుకు ఆయన కుటుంబసభ్యులు సిద్దంగా లేకపోవడంతో.. ఇతరులకు ఆ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ పదవి కోసం బొత్స రాక ముందు అప్పిరెడ్డినే పక్ష నేతగా ఉండేవారు. అయితే ఇప్పుడు వరుదు కల్యాణి పేరు వినిపిస్తోంది. అందుకే అప్పిరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది.
