తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని తన తరపున వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈడీ కూడా తనిఖీలు చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆయన మీడియా సమావేశం పెట్టారు. తన బంధువులు ఢిల్లీలో మద్యం వ్యాపారం చేశారు కానీ తనకు సంబంధం లేదన్నారు. ఈడీకి అన్నీ చెప్పామని స్పష్టం చేశారు. తర్వాత తన రాజకీయ ఆలోచన వివరించారు.
మాగుంట కుటుంబం దశాబ్దాలుగా ప్రకారం, నెల్లూరు జిల్లాల్లో కీలకంగా ఉంటుంది., మాగుంట సుబ్బరామిరెడ్డిని నక్సలైట్లు చంపేసిన తర్వాత ఆయన సోదరుడు శ్రీనివాసులరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఎక్కువగా ఎంపీగా పోటీ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. కాంగ్రెస్ లో ఉండే ఆయన రాజకీయాలు మారిపోవడంతో టీడీపీలో చేరారు. ఓ సారి ఓడిపోయారు. మరోసారి వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో ఆయన ఇమడలేకపోతున్నారు. అందుకే చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పెద్దగా కనిపించడం లేదు.
ఆయనకు ఈ సారి టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని కూడా అనుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా తాను పోటీ చేయడం లేదని..తన కుమారుడు పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయన కుమారుడికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో స్పష్టత లేదు. అయితే తాను వైసీపీ నుంచే పోటీ చేస్తానని ఆయన చెప్పలేదు. అందుకే… ఆయన కుమారుడి పోటీ సరే.. ఏ పార్టీ నుంచి అనేది ఒంగోలులో హాట్ టాపిక్ అయిపోయింది.