అమరావతి రియల్ ఎస్టేట్ ఢాం.. దొనకొండ ని పైకి లేపడానికేనా?

ysrcp

ప్రపంచ బ్యాంకు, అమరావతి నిర్మాణం కోసం ఇవ్వదలచిన 300 మిలియన్ల యుఎస్ డాలర్ల రుణం విషయంలో వెనక్కి తగ్గడం, దానికి ముందు అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు అమరావతిలోని రియల్ ఎస్టేట్ బిజినెస్ పైన ప్రతికూల ప్రభావం చూపేలా ఉండడం – వీటన్నింటి మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఒక వర్గం విశ్లేషకులు మాత్రం దొనకొండ లో రియల్ ఎస్టేట్ నిమళ్ళీ పైకి లేపే ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయని, అమరావతి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వెనుక ఒక వ్యూహం ఉందని అభిప్రాయ పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

2013 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు విషయమై నిర్ణయం తీసుకున్నప్పటికీ, కచ్చితంగా తెలంగాణ 2014లో ఏర్పడుతుందని తెలిసినప్పటికీ అప్పటి రాజకీయ నాయకులు మాత్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమం పేరిట, ఏదో ఒక రకంగా తెలంగాణ ఏర్పాటును ఆపుతామని ప్రజలను మభ్య పెడుతూ, నిజంగా రాష్ట్రం విడిపోతే సాధించుకోవలసిన హక్కుల గురించి చర్చ జరగకుండా పక్కన పెట్టేశారు. అయితే ప్రజలంతా ఇటు వైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసుకుంటూ ఉంటే, అప్పట్లో కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నాయకులు మాత్రం, తదుపరి రాజధాని ఎక్కడ ఉండవచ్చు అని ఆరాలు తీస్తూ అక్కడ పెట్టుబడులు పెట్టి భూములు కొనుక్కున్నారని సమాచారం. అయితే ఆ సందర్భంగా వారికి ఉన్న అంతర్గత సమాచారం మేరకు చాలామంది నేతలు ప్రకాశం జిల్లాలోని దొనకొండ లో రాజధాని వస్తుందనే ఉద్దేశంతో దొనకొండ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. కానీ వారు ఊహించిన దానికి భిన్నంగా, కేంద్ర ప్రభుత్వం రాజధానిని ప్రకటించకుండానే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి లో రాజధానిని ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో అప్పట్లో దొనకొండ లో పెట్టుబడులు పెట్టిన చాలా మంది కాంగ్రెస్ నేతలు కాస్త నిరుత్సాహ పడ్డారు. అయితే అప్పట్లో అలా దొనకొండ లో భూములు కొన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు వైఎస్ఆర్ సీపీలో లేదంటే బిజెపిలో ఉండడం వల్ల, దొనకొండ లోని తమ భూముల విలువలు పెరిగేలా చేయాలని ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం.

రాజధానిని పూర్తిగా అమరావతి నుండి దొనకొండ కి మార్చక పోయినప్పటికీ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట అమరావతి తో సమానంగా దొనకొండ ను అభివృద్ధి చేయమని ప్రభుత్వాన్ని బలంగా కోరుతున్నట్లు సమాచారం. అమరావతి లో కొత్తగా నిర్మాణాలు ఏవి చేపట్టకుండా ఉండడం, నెమ్మదిగా అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రాన్ని తెర మీదకు తీసుకు రావడం, ఆ తర్వాత దొనకొండ లో తమ తమ స్థలాలు ఉన్న చోట్ల అభివృద్ధి జరిగేలా రూపకల్పన చేయడం వంటి వాటి మీద కసరత్తు చేయడం- ఇలా ఒక ప్రణాళికా బద్ధమైన వ్యూహం తో అప్పట్లో కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్సిపి బిజెపి లలో ఉన్న నాయకులు ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ గుసగుసలో ఎంతమేరకు వాస్తవాలు ఉన్నాయి అన్న విషయం తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com