పులివెందులలో జరిగిన ఎన్నికలలో పరువుపోయినా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం తమ అమరావతి డ్యూటీ మాత్రం మానడం లేదు. అదిగో మునిగిపోయింది…అదిగో మునిగిపోయిందని ఒకటే ఫేక్ వీడియోలు, ఫోటోలతో తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న అమరావతిలోని తుళ్లూరులో బసవతారకం ఆస్పత్రికి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. చుట్టుపక్కల చుక్క నీరు కనిపించలేదు. అయినా సరే ప్రచారం మాత్రం ఆపలేదు. అది ఇంకా కొనసాగుతోంది.
వర్షం పడుతున్నా.. అమరావతిలో పనులు మాత్రం ఆపలేదు. కార్మికులు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. వర్షంపడుతోందని సెలవు కూడా ఇవ్వలేదు. రోడ్లపై నీళ్లు నిలవలేదు. కానీ ఎక్కడివక్కడ పనులు ఆగిపోయాయని ప్రచారం చేస్తున్నారు. నిజానికి అమరావతి నిర్మాణం జరుగుతోంది. అన్ని నిర్మాణాలు పూర్తయి.. వరద కాలువల వ్యవస్థ విఫలమైతేనే మునుగుతుంది. లేకపోతే బాగానే ఉంటుంది.కానీ నదిలో నీళ్లు ఊళ్లలోకి వచ్చేస్తాయని చెప్పడానికి తాపత్రయ పడుతున్నారు.
అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పటి నుండి ఈ తరహా ప్రచారం చేస్తున్నారు. నిర్మాణాల కోసం పునాదులు తీస్తే.. ఆ పునాదుల్లో నీరు చేరితే.. ఇంకేముంది అమరావతి మునిగిపోయిందని సంబర పడుతున్నారు. సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి మరీ ఇలాంటి ప్రచారాలు చేయించడం వల్ల ఏమవుతుందో కానీ.. అసలు పులివెందులలో తమ పరువు పోయిందన్న సంగతిని మాత్రం ఏమీ తెలియనట్లుగా ఉంటున్నారు.