యూపీలో హీరోయిన్ దిశాపటాని ఇంటిపై కాల్పులకు తెగబడిన ఇద్దరు యువకుల్ని యూపీ పోలీసులు వెదికి పట్టుకుని ఎన్ కౌంటర్ చేశారు. ఎదురు కాల్పుల్లో చనిపోయారని తేల్చారు కానీ.. అక్కడ జరిగిందేమిటో చిన్న పిల్లవాడికి తెలుసు. గోల్డీ బ్రార్ అనే కెనడాలో దాక్కున్న గ్యాంగ్ స్టర్.. ఏదో సిల్లీ కారణంతో సెలబ్రిటీలను బెదిరించడానికి .. తన గ్యాంగ్ ను విస్తరించడానికి ఇలాంటి టెక్నిక్‌లు ఫాలో అవుతూంటారు. యోగి దగ్గర అలాంటివి చెల్లవని నిరూపించేశారు. దిశా పటానికి తండ్రికి ఫోన్ చేసి.. మరీ యోగి కాల్పులు జరిపిన వాళ్లను వదిలి పెట్టబోమని హామీ ఇచ్చారు. ఇరవై నాలుగు గంటల్లో పని పూర్తి చేశారు.
యోగి వచ్చాక యూపీలో దారిలోకి వచ్చిన శాంతిభద్రతలు
యోగి సీఎం కాక ముందు యూపీలో శాంతిభద్రతలు అంటే.. గ్యాంగ్ స్టర్లు ఎంత కామ్ గా ఉంటే అంత లా .. ఎంత రెచ్చిపోతే అంత ఆర్డర్ అన్నట్లుగా ఉండేది. సాధువు అయిన యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెత్త అంతా ఏరివేయడం ప్రారంభించారు. ఎన్ కౌంటర్లతో రౌడీలను ఏరివేశారు. కొన్ని వందల ఎన్ కౌంటర్లు జరిగాయి. అసాంఘిక శక్తులన్నీ హతమయ్యాయి. ఎవరైనా రౌడీని.. గ్యాంగ్ స్టర్ ను అని పిలిపించుకోవాలంటే.. వణికిపోయే పరిస్థితులు తెచ్చారు. అలాంటి పరిస్థితుల్లోనూ కొంత మంది రెచ్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై ఏ మాత్రం కనికరం చూపించడం లేదు. దానికి తాజా ఎన్ కౌంటరే ఉదాహరణ.
యోగిపై చాలా విమర్శలు – కానీ అసాంఘిక శక్తుల్ని ఊహించగలరా ?
యోగి చట్టాలను ఉల్లంఘిస్తున్నారని.. విస్తృతంగా ఎన్ కౌంటర్లకు అవకాశం కల్పిస్తున్నారని కొంత మంది విమర్శిస్తున్నారు. కానీ అసాంఘిక శక్తులు బలపడితే.. అరాచకమే రాజ్యమేలుతుంది. అలాంటి పరిస్థితిని ప్రజలు కోరుకోరు. యూపీలో ఎన్ కౌంటర్ అయిన అనేక మంది రౌడీషీటర్లు, గ్యాంగ్ స్టర్ల ఘటనలు ప్రజల్లో సంతోషానికి కారణం అయ్యాయి కానీ విమర్శలు రాలేదు. అసాంఘిక శక్తులు.. ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే ఖచ్చితంగా అణిచివేయాల్సిందే. రాజకీయ ముసుగులో.. ప్రజల్ని భయపెట్టేందుకు ప్రోత్సహిస్తే.. అది చివరికి నెత్తి మీద చేయి పెట్టుకున్న చందంగా మారుతుంది.
అరాచకశక్తుల్ని ఉపేక్షించకూడదు!
ఇటీవల జైలులో ఓ నిందితుడు.. జైలర్ డ్యూటీలో ఉన్న ఉద్యోగిపై సుత్తితో అత్యంత కిరాతకంగా దాడి చేసి పరారయ్యాడు. సరిగ్గా తగిలి ఉంటే ఆ పోలీసు ఉద్యోగి చనిపోయేవారు. అలాంటి మనస్తత్వం ఉన్న వారిని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. పట్టుకుని మళ్లీ జైల్లో పెట్టారు. దాని వల్ల మరోసారి అలాంటి పని చేయడానికి ధైర్యం వస్తుంది కానీ.. భయం రాదు. ఇతర ఖైదీలకూ అంతే. అలాంటి వారికి సరైన శిక్ష వేసి ఉన్నట్లయితే.. మరొకరికి అలాంటి ఆలోచన రావాలంటే భయం అవుతుంది. పోలీసులపై కూడా రాజమండ్రిలో కొంత మంది ఎదురుదాడి చేశారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ పై దాడి చేశారు. పోలీసులు కూడా మెతకగా ఉంటే ఇలాంటివి జరుగుతాయి. అసాంఘికశక్తుల్ని అణిచివేయాలంటే.. కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. యోగి అదే చేస్తున్నారు. యూపీ ఇమేజ్ను మారుస్తున్నారు.