ఎవరు పని వాళ్లే చేయాలి. ఒకరి పనిలో ఇంకొకరు దూరిపోతే… ఇంటర్ఫ్రీయెన్స్ అంటారు. పచ్చిగా మన భాషలో చెప్పాలంటే ‘కెలుకుడు’ కార్యక్రమం అన్నమాట. ఇండ్రస్ట్రీలో కొమ్ములు తిరిగిన హీరోలు కథలో, సీన్లలో వేళ్లూ, కాళ్లూ పెడితే ఓ లెక్క ఉంటుంది. ఎందుకంటే వాళ్ల అనుభవం అలాంటిది. స్టార్లుగా ఎదిగారంటే, ఇమేజ్‌లు సంపాదించుకొన్నారంటే.. అదంతా కచ్చితంగా వాళ్ల గొప్పదనమే. ఆ అనుభవం కొద్దీ, తమ సినిమా బాగుండాలన్న ఆత్రం కొద్దీ దర్శకుడి పనిలో జోక్యం చేసుకొంటే.. ఆ ఆరాటం అర్థం చేసుకోదగినదే. అయితే.. ఈమధ్య కొంతమంది యంగ్ స్టార్లు, ఒకట్రెండు సినిమాలు హిట్టయ్యేసరికి మురిసిపోతూ, తామే రాజులమంటూ మీసాలు తిప్పేస్తూ, తమకన్నీ తెలుసన్నట్టు పోజులు కొడుతూ కెలుకుడు స్టార్లుగా మారిపోతున్నారు. టాలీవుడ్లో ఆ జాబితా కాస్త ఎక్కువగా ఉండడం… దర్శకుల పాలిట శాపంలా మారింది.
చిన్న చిన్న సినిమాలు చేసుకొంటూ, చిన్న చిన్న హిట్లు కొట్టుకొంటూ ఈరోజున చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండే ఓ కుర్ర హీరో కూడా అంతే. నిజానికి అతగాడు హీరో అవ్వాలని ఇండ్రస్ట్రీలోకి రాలేదు. దర్శకుడిగా ప్రతాపం చూపించాలని వచ్చి, సడన్‌గా హీరో అయ్యాడు. హీరో అయ్యి ఒక్క హిట్టు కొట్టాడో లేదో.. రెండో సినిమా నుంచే తనలోని దర్శకుడ్ని నిద్రలేపి, యాక్షన్.. కట్ తప్ప అన్నీ తానే చెప్పేస్తున్నాడట. సెట్లో అతగాడి వీర విహారం చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు. కమెడియన్ స్థాయి నుంచి హీరోగా ఎదిగిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ పరిస్థితీ కూడా ఇంతేనట. కొరియన్ సినిమాల్ని తెగ చూసి, ఆ డీవీడీలను దర్శకుల చేతిలో పెడుతున్నాడట. నెక్ట్స్ తీయబోయే సీన్ ఇలానే ఉండాలి.. అని చెబుతున్నాడట. దాంతో దర్శకులు ఆయన్ని ఫాలో అయిపోవాల్సివస్తోంది. మరో హీరో ఉన్నాడు.. చాలా డీసెంట్ యాక్టర్. మినిమం గ్యారెంటీ హీరో. అలాంటిది ఆయన కూడా డైరెక్టర్ పనిలో తెగ ఇన్వాల్వ్ అయిపోతున్నాడని టాక్. ఈమధ్య ఓ సినిమా విడుదలై.. జస్ట్ యావరేజ్‌గా ఆడింది. ఆ సినిమాని వీరలెవిల్లో కెలికేసి, కథని నానా రకాలుగా మార్చాడని, అందుకే ఆ ఎఫెక్ట్ సినిమాపై పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
50 సినిమాలకు పైగా తీసిన ఓ దర్శకుడి (ఇప్పుడు కీర్తి శేషులయ్యారు) తనయుడు సినిమాల్లో హీరోగా కొనసాగుతున్నాడు. పాపం.. ఈమధ్య హిట్లు లేవులెండి. ఈయన గారి పనీ ఇంతేనట. కథలు తానే తయారు చేసి, సీన్లు కూడా తానే ప్రిపేర్ చేసి, ఆ కాగితాలు దర్శకుడి చేతిలో పెడతాడట. ఒకవేళ కథ, సీన్లు దర్శకుడివైతే.. సెట్లో తనకు తాను ఇంప్రవైజేషన్ పేరుతో కొత్త సీను అల్లేస్తాడట. ఈమాత్రం దానికి స్క్రిప్టు రాయడం ఎందుకు అని సదరు దర్శకులు లబో దిబో అంటున్నారని టాక్. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు పేర్కొన్న హీరోలంతా దర్శకులు కావాలని కలలుకన్నవారే. వాళ్ల అదృష్టం బాగుండి హీరోలయ్యారు. అయినా సరే.. ఆ ఉబలాటం తీరిక ఇలా ‘కసి’ తీర్చుకొంటున్నారేమో. సినిమా హిట్టయితే ఫర్వాలేదు. ఫ్లాప్ అయితే మాత్రం అది దర్శకుల ఎకౌంట్ లోకి వెళ్తుంది. వాళ్ల కెరీర్ పూర్తిగా నాశనం అవుతుంది. దర్శకుడు కావాలన్న కలలుంటే… స్వయంగా రంగంలోకి దిగి ఓ సినిమా తీసుకొంటే చాలు కదా? మరో దర్శకుడ్ని బకరా చేయడం ఎందుకు? ఈ విషయాన్ని ఈ హీరోలంతా ఎప్పుడు తెలుసుకొంటారో????