వైఎస్ కుటుంబంలో చెలరేగిన ఆస్తుల వివాదం జగన్ వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రజల ముందు ఉంచుతోంది. తమ మధ్య ఉన్నది కేవలం ఆస్తుల పంపకానికి సంబంధించిన కుటుంబ సమస్య అని, దీనిని రాజకీయంగా చూడవద్దని వైఎస్ షర్మిల పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం స్వంత చెల్లెలిని కూడా విడిచిపెట్టకుండా, తన అనుచరుల ద్వారా ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. షర్మిల ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంటే, ఆమెను అడ్డుకోలేక జగన్ రెడ్డి స్క్రిప్ట్‌లు రాసి తన పార్టీ నేతలతో విమర్శలు చేయించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
రాచమల్లు అనుచిత వ్యాఖ్యలు
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వంటి నాయకులు షర్మిల పై చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత హేయంగా ఉన్నాయి. కుక్కలతో మొరిగిస్తున్నారు అని షర్మిల చేసిన విమర్శలకు, మేము విశ్వాసం ఉన్న కుక్కలం అంటూ వారు సమాధానం ఇవ్వడం చూస్తుంటే, వారు తమ యజమానిని సంతృప్తి పరచడం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని అర్థమవుతోంది. షర్మిల కేవలం వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని, తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆస్తుల పంపకం జరగాలని కోరుతుంటే, దానిని చంద్రబాబు గారి కుట్రగా చిత్రీకరిస్తూ దాన్ని జగన్ దాన్ని రాజకీయం చేసుకుని కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్నారు.
విజయమ్మ లేఖతో బయటపడ్డ నిజాలు
వైఎస్ విజయమ్మ ఇటీవల విడుదల చేసిన నోటరైజ్డ్ అఫిడవిట్ జగన్ రెడ్డి గారి అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు ఆస్తులన్నీ ఉమ్మడి ఆస్తులేనని, వాటిని మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా పంచాలని ఆయన కోరుకున్నారని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు. జగన్ రెడ్డి తన చెల్లెలికి అన్యాయం చేశారని, ఎంఓయూ కుదుర్చుకున్నా దానిని అమలు చేయలేదని స్వయంగా తల్లి చెప్పడం ఆయన స్వార్థపూరిత మనస్తత్వానికి నిలువుటద్దం. రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వమే పరమావధిగా భావించే జగన్ రెడ్డి , తన కుటుంబాన్ని కూడా అందులోకి లాగడానికి ఏ మాత్రం వెనుకాడలేదు.
రాజకీయంగా షర్మిలను ఎదుర్కోలేకనే
షర్మిల చేస్తున్న పోరాటం కేవలం ఆస్తుల కోసమే కాదని, అది ధర్మం కోసం జరుగుతున్న యుద్ధమని చెబుతున్నారు. బాబాయ్ హత్య కేసులో నిందితులను కాపాడుతున్న తీరును ఎండగడుతున్నందుకే ఆమెపై ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. జగన్ రెడ్డి కి కనీస వ్యక్తిత్వం లేదని, రాజకీయం కోసం తన రక్తాన్ని పంచుకు పుట్టిన చెల్లెలిని కూడా శత్రువుగా చూస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిలను రాజకీయంగా ఎదుర్కోవాలన్న సూచనలు జగన్ కు వస్తున్నాయి. ఆయనకు అది చేతనైతే వ్యక్తిత్వంపై దాడి చేయించే ప్రయత్నం చేయరని అందరికీ తెలుసన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
