మూడు రాజధానుల పైత్యం నుంచి జగన్ రెడ్డి ఇంకా బయటకు వచ్చినట్టు లేరు. కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా అమరావతిపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవడం లేదు. మూడు రాజధానుల నిర్ణయం ఆ పార్టీని ఎంత దెబ్బతీసిందో ఎన్నికల ఫలితాలతోనైనా తెలుసుకుంటారని అనుకున్నా.. అబ్బే అదేం లేదని తేల్చేశారు జగన్ రెడ్డి.
లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని వార్తల నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన జగన్ రెడ్డి.. తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్తూ అమరావతిపై మరోసారి విషం కక్కారు. ప్రస్తుతం చంద్రబాబు అనుకుంటున్నట్టుగా రాజధాని కట్టడం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని, అందుకే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో, విజయవాడ – గుంటూరు మధ్య ఒక 500 ఎకరాల్లోనో కట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇదే మెరుగైన నిర్ణయం అయితే జగన్ ఈ విధానం ఎందుకు ఫాలో కాలేదో ఆయనకే తెలియాలి. కనీసం దీనిపై వివరణ కూడా ఇవ్వలేదు.
అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు కష్టపడుతున్నారు. కేంద్రం సహకారంతో ఈ మూడేళ్లలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పనులు కూడా ప్రారంభం అయ్యాయి. పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. అయినా జగన్ మాత్రం అమరావతిపై ఇంకా అదే పాట పాడుతున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే మూడు రాజధానుల విషయంలో వైసీపీ స్టాండ్ మారినట్లుగా కనిపించడం లేదు.