పోలీసుల్ని మోహరిస్తే అంత మందిని ఎందుకు పెడుతున్నారని .. తక్కువ మందిని పెడితే సెక్యూరిటీ ఇవ్వలేదని సాకులు చెబుతున్న జగన్ రెడ్డి ..తనకు ఎంత సెక్యూరిటీ కావాలో తానే డిసైడ్ చేసుకున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వారి భద్రత మధ్యనే తన పర్యటనలు ఉండేలా చూసుకోవాలని డిసైడయ్యారు. అధికారం కోల్పోయిన తరవాత జగన్ కొంత మంది బౌన్సర్లను తన ఇంటి వద్ద పెట్టుకున్నారు. అలా తన పర్యటనల్లో కూడా వారు ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో తనకు జడ్ ప్లస్ భద్రత ఇవ్వడం లేదని కోర్టుల్లో పిటిషన్లు వేశారు.
ఆయనకు సీఎం కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని వందల మంది పోలీసుల్ని మోహరిస్తున్నామని పోలీసులు కోర్టుకు చెబుతున్నారు. ఆయన పర్యటనలు పూర్తిగా దురుద్దేశపూర్వకంగా.. అసాంఘిక శక్తులతో కలిసి సాగుతున్నాయని అనుమానిస్తున్న పోలీసులు ప్రతిక్షణం నిఘా పెడుతున్నారు. పూర్తి భద్రత కల్పిస్తున్నారు. అయితే ఇలా భద్రత కల్పించడం అంటే తన వద్దకు జనం రాకుండా నియంత్రించడం అని ఆయన అనుకుంటున్నారు.
జగన్ ప్రైవేటు సైన్యంలో రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద మొద్దంలో జీతాలు ఇచ్చి మంచి దేహదారుఢ్యం ఉన్న వారిని నియమించుకోనున్నారు. ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీని దూరంగా అంటే రెండో లేయర్ లో పెట్టి.. ఈ ప్రైవేటు సైన్యం సెక్యూరిటీ మధ్యనే జగన్ పర్యటనలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.